‘రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’

by Rajesh |
‘రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ అన్నారు. బండి సంజయ్ భాష ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో లేదన్నారు. అధ్యక్షుడిగా బండి ఉండటం బీజేపీ దురదృష్టం అన్నారు. పంట నష్టంపై బండి వ్యాఖ్యలు అర్థరహితం, హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేస్తున్నారో చెప్పి ఇక్కడ మాట్లాడాలన్నారు. పంట నష్టానికి సంబంధించి రూ.151 కోట్ల రూపాయలను హరీష్ రావు మొన్ననే విడుదల చేశారని, వాట్సాప్ యూనివర్సిటీ‌ల్లో అబద్దాలు ప్రచారం చేస్తూ బీజేపీ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు.

రైతులకు కేసీఆర్ ఇప్పటివరకు రూ.4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారని, మోడీ రైతులకు ఏం చేస్తున్నారని బండి ప్రశ్నించాలని సూచించారు. ఏడాదికి రైతుబంధు కింద రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని, బండికి తెలివి ఉంటే, దమ్ముంటే రైతులకు కేంద్రం నుంచి అదనంగా మరో రూ.పది వేలు ఇప్పించాలని సూచించారు. కాళ్లు మొక్కి, చెప్పులు మోసైనా తీసుకురావాలని హితవు పలికారు. తెలంగాణ మోడల్ అంటేనే రైతులకు మేలు చేసే మోడల్... గుజరాత్ మోడల్ అంటే మోసం చేసి పారిపోయే మోడల్ .. బీజేపీకి వ్యక్తిగత ఆరోపణలు, అబద్దాలు చేయడం తప్ప ఏదీ చేతకాదన్నారు. బీజేపీ అబద్దాలు మాట్లాడి ఎన్ని రోజులు బతుకుతుందన్నారు.

కర్ణాటకలో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. దేశ ప్రజలు బీజేపీకి శిక్ష విధించడం ఖాయం.. నేతలకు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎళ్లకాలం తప్పుడు పనులు, దండాలు నడువవు అని అన్నారు. ఎంపీ గుండు అరవింద్ కూడా నయా పైసా కు పనికి రాడన్నారు. అబద్దాలు తప్ప అరవింద్ కు ఏమి రావని ఎద్దేవాచేశారు. బీజేపీ ప్రజలను మోసం చేసి గెలువాలనే ప్రయత్నం చేస్తుందని, ఆపార్టీ అబద్దాలు, మోసాలను గ్రామగ్రామన ఎండగడతామన్నారు. తెలంగాణలో బీజేపీ నేతలు తప్ప ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ సచివాలయం కడితే తప్పు..మోడీ పార్లమెంటు కడితే ఒప్పా అని ప్రశ్నించారు. అబివృద్ధిని చూసి బండి సంజయ్ కు పిచ్చి లేచింది.. తక్షణమే పిచ్చి ఆస్పత్రి లో చేర్పించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed