యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన భట్టి

by M.Rajitha |
యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : పరిశ్రమలు పెట్టేందుకు యువత ముందుకు వస్తే భారీ రుణాలు ఇప్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రీయల్ పార్క్ పనులకు భట్టి విక్రమార్క సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, కానీ వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి సరైన అవగాహన లేకపోవడం సమస్య అవుతోందని అన్నారు. అందుకే ప్రభుత్వమే పరిశ్రమలు, వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్, రుణాలు, మార్కెట్ వసతులు కల్పించి వారిని పారిశ్రామిక రంగాలలో ప్రోత్సాహిస్తామని తెలిపారు.

మధిరలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయడం తన దశాబ్దాల కల అన్న భట్టి.. 55 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పార్కుకు 44 కోట్ల నిధులు కేటాయించామని వివరించారు. ఈ ఇండస్ట్రీయల్ పార్కు పనులను వేగంగా పూర్తి చేయిస్తామని అన్నారు. నిరుద్యోగ యువత పరిశ్రమల్లోకి వచ్చేందుకు అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులని ఆదేశించిన భట్టి విక్రమార్క.. పారిశ్రామిక రంగాల్లోకి వచ్చే యువతకు రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మధిర ఇండస్ట్రీయల్ పార్కులో తక్కువ ధరకే ఔత్సాహిక, యువ పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కల్పిస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కూడా ప్లాట్ల కేటాయింపులో రిజర్వేషన్లు ఇస్తామన్నారు.

Next Story