TG Budget: రూ.3 లక్షల కోట్లు..! రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్

by Shiva |
TG Budget: రూ.3 లక్షల కోట్లు..! రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్​రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా, ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులకు వడ్డీల కింద అధిక నిధులు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆరు గ్యారంటీల్లో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ అమలవుతున్నాయి.

అమలు కాని స్కీమ్స్ కోసం..

స్కీమ్స్ కొనసాగించేందుకు నిధుల కేటాయింపు, ఇంకా అమలు కాని వాటి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. అందులో చేయూత పెన్షన్, మహాలక్ష్మిలో స్కీంలో భాగమైన మహిళలకు నెలకు రూ.2500 పథకాలు అమలు కావట్లేదు. మిగతావి అమలవుతున్నాయి. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి ఓటాన్ అకౌంట్, మరోసారి ఫుల్​బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈసారి ఫుల్​బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అందుకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల అంచనాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మార్చి మూడో వారంలో గవర్నర్​ప్రసంగం తర్వాత బడ్జెట్​సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 28 లేదా 29 కల్లా సమావేశాలను ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఉగాది, రంజాన్​తదితర పండుగలూ మార్చి నెలాఖరునే ఉండటంతో వాటికి అనుగుణంగా సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్​ఆమోదం తర్వాత గవర్నర్​ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ఏటా పెరుగుతున్న ఆదాయం..

ఉమ్మడి రాష్ట్రంలో చివరి బడ్జెట్​2013‌‌‌–14 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,36,629 కోట్లుగా ఉంది. అందులో 42 శాతం వాటాగా తెలంగాణకు తీసుకుంటే రూ.56,947 కోట్లుగా చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను​2018–19లోనే తెలంగాణ దాటేసింది. ఏటా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోంది. జీఎస్‌డీపీ కూడా పెరిగింది. నాన్​టాక్స్​రెవెన్యూ మినహా కాంగ్రెస్ సర్కారు హయాంలో అన్ని శాఖల్లోనూ ఆదాయం పెద్దగా ఎక్కడా తగ్గినట్లు కనిపించడం లేదు. గతేడాది స్థాయిలోనే ఈసారి ఆదాయం కొనసాగుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి పన్నుల శాతం పెరగడం, వచ్చే ఏడాది మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పులను కేంద్రం రీషెడ్యూల్​చేయడంతో రాష్ట్రానికి మరింత ఆదాయం సమకూరనుందని టాక్. ఫలితంగా మార్కెట్లో డబ్బు సరఫరా పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్దఎత్తున చేపట్టవచ్చని, క్యాపిటల్​వ్యయం ఎక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్లేషిస్తు్న్నారు.

లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది ఆదాయం

రాష్ట్రంలో రియల్​ఎస్టేట్​పడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా.. ఎక్కడా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గలేదు. హైడ్రా, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల రియల్ రంగం​పడిపోయిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా భూముల అమ్మకాల విషయంలో మినహా మిగిలిన వాటిల్లో ఆదాయం అంచనాకు అనుగుణంగా సమకూరుతోందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరి నాటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంచనాలో రూ.1,82,437 కోట్ల ఆదాయం వచ్చింది. అంచనా వ్యయంలో 66.57 శాతం నమోదైంది. గతేడాది కంటే 1.8 శాతం తక్కువగా ఉంది. నాన్‌టాక్స్​రెవెన్యూ తగ్గడంతోనే ఆదాయం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనీసం 15‌‌–18 శాతం ఇంకా ఆదాయం వస్తుందని అంచనా వేస్తుండగా.. గతేడాది కంటే ఈసారి అధికంగానే ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఎక్కువగా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వస్తాయని తెలుస్తోంది. ఆర్థిక ఏడాది ముగుస్తున్న వేళ అధికారులు పన్నులు చెల్లించే వారిపై ఒత్తిడి తేవడం కామన్. అందుకే ఆర్థిక ఏడాది చివరలో ఎక్కువగా చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ గత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత పదేళ్ల ఆదాయం సగటు 82 శాతం ఉంది. గత మూడేళ్లుగా ప్రభుత్వ బడ్జెట్ వాస్తవ ఆదాయం వివరాలను పరిశీలిస్తే 79 శాతం మాత్రమే ఉంది. దీనిని సరిపోల్చి చూస్తే ఈ ఏడాది సైతం ఎక్కడా ప్రభుత్వ ఆదాయం తగ్గే అవకాశం లేదని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story