- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: బాధ్యత గల పదవిలో ఉన్నోళ్లు ఆలోచించి మాట్లాడాలి.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లలను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం తెలుగు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములుకు బదులు సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సురవరం ప్రతాప రెడ్డి మార్పు ప్రతిపాదన చేశారని సభలో వెల్లడించారు.
తాము పొట్టి శ్రీరాములు త్యాగాలను ఏమాత్రం తక్కువగా చూడటం లేదని తెలిపారు. ఆయన ప్రాణ త్యాగాలను అందరం స్మరించుకోవాలని అన్నారు. రాష్ట్ర పుర్విభజన చట్టం ప్రకారం కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. తెలుగు వర్సిటీ పేరు మార్పుపై కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం ఆయన స్థాయిని తగ్గించడం కాదని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణకు గొప్ప సేవ చేశారని, గొల్కొండ పత్రిక నడపడంతో పాటు 350 మంది కవులను సైతం ప్రోత్సహించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ పేరు కూడా మార్చుకున్నామని గుర్తు చేశారు. ఒక కులం పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని.. కులం, వ్యక్తి మీద ప్రేమతో పేరు మారుస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఒక వ్యక్తి కోసమో.. కులం కోసమో కాదని తెలిపారు. కులాల వారీగా విభజించి రాజకీయం చేయడం సరికాదని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నోళ్లు ఆలోచించి మాట్లాడాలని కామెంట్ చేశారు. పరిపాలనా పరమైన సమస్యల పరిష్కారానికే పేర్ల మార్పు అని అన్నారు. తెలంగాణలో ఉన్న సంస్థలకు తెలంగాణ వ్యక్తుల పేర్లు పెడుతున్నామని.. చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని.. ఆ విషయంలో బీజేపీ చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య పేరు పెడదామని, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రస్తావించారు.