కామారెడ్డి BRSలో టెన్షన్.. టెన్షన్! తాజాగా జడ్పీటీసీపై ఎంపీపీ దాడితో కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-04 07:58:46.0  )
కామారెడ్డి BRSలో టెన్షన్.. టెన్షన్! తాజాగా జడ్పీటీసీపై ఎంపీపీ దాడితో కలకలం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న కామారెడ్డి బీఆర్ఎస్‌లో విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. కేసీఆర్ పోటీ ప్రకటన నుంచి పార్టీలో ఏదో ఒక అంశం విబేధాల రూపంలో బయటకు వస్తోంది. పార్టీలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ పార్టీకి తీవ్రంగా నష్టం చేకూరేలా ఉంటున్నాయి. ఈ పరిణామాలు ప్రతిపక్ష పార్టీల గెలుపునకు పునాదులుగా మారబోతున్నాయన్న టాక్ కామారెడ్డి పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. ఈ క్రమంలో అధినేత కేసీఆర్ గెలుపు అంత ఈజీ కాదని చర్చ సాగుతోంది.

వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి..

కామారెడ్డి బీఆర్ఎస్‌లో జరుగుతున్న వరుస ఘటనలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధినేత తర్వాత యువరాజు నేరుగా రంగంలోకి దిగిన పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నాటి నుంచి విబేధాలు ఒక్కొక్కటిగా బహిరంగంగానే బయటకు పొక్కుతున్నాయి.

కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సమయంలో మున్సిపల్ చైర్మన్ ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీయడంతో వేదిక పైనుంచే నాయకులకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ప్రగతి భవన్ సమావేశంలోను నాయకులకు గట్టిగానే అక్షింతలు పడ్డట్టుగా ప్రచారం సాగింది.

తిర్మల్ రెడ్డిపై దాడితో డిఫెన్స్‌లో బీఆర్ఎస్

ఉద్యమ నాయకుడు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డిపై కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దాడికి పాల్పడిన ఘటనతో బీఆర్ఎస్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన తిర్మల్ రెడ్డిపై దాడి ఘటన బీఆర్ఎస్‌లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధిష్టానం రెండు రోజులకు దిద్దుబాటు చర్యలు చేపట్టి పార్టీ నుంచి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వైస్ చైర్మన్ దంపతులు, సోదరుడు, ఇతర నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.

కేటీఆర్ సీరియస్ వార్నింగ్

ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘటనపై కేటీఆర్ నేరుగా స్పందించారు. పార్టీకి నష్టం చేసే విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయినా నాయకుల్లో మార్పు రావడం లేదు.

తాజాగా జడ్పీటీసీపై ఎంపీపీ దాడి

నిన్న శుభం కన్వెన్షన్ హాలులో మాచారెడ్డి మండల ఎన్నికల కమిటీ ఎన్నికపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డిపై ఎంపీపీ నర్సింగ్ రావు దాడి ఘటన కలకలం రేపింది. బూత్ స్థాయి సమావేశంలో చుక్కాపూర్ ఎన్నికల ఇంచార్జి నియామకం విషయంలో ఎంపీపీ, జడ్పీటీసీకి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆవేశంతో ఊగిపోయిన ఎంపీపీ నర్సింగ్ రావు జడ్పీటీసీ రాంరెడ్డి చొక్కా పట్టి లాగి దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. ఈ ఘటనలో రాంరెడ్డికి గాయాలు కావడంతో తీవ్ర దుమారం రేగినట్టు తెలుస్తోంది. మరోసారి బీఆర్ఎస్‌లో ఉన్న వర్గ విబేధాలు ఈ ఘటనతో బయటపడ్డాయన్న ప్రచారం సాగుతోంది. మాచారెడ్డిలో ఎంపీపీ అధిపత్యమే కొనసాగుతుందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకమార్లు జరిగినా పార్టీ మీద, ఎమ్మెల్యే మీద ఉన్న అభిమానంతో సైలెంట్‌గా ఉంటున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలుంటాయా.. లైట్ తీసుకుంటారా..?

మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు పార్టీకి బలమైన నాయకుడు. ఆయన చేతిలో సుమారు రెండు మండలాల ఓట్లు ఉన్నాయి. ఆ మండలాల్లో ఆయన చెప్పిందే వేదం. ఈ తరుణంలో తిర్మల్ రెడ్డి ఘటనను కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఆయనపై దాడి జరిగిన విషయంలో చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా ఎంపీపీ నర్సింగ్ రావువు కూడా సస్పెండ్ చేస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంపీపీ లాంటి బలమైన నాయకుని సస్పెండ్ చేస్తే పార్టీకి గడ్డుకాలమే అనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ చెప్పినట్టుగా ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు అనే వార్నింగ్ నర్సింగ్ రావు విషయంలో వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రతిపక్షాలకు అస్త్రం.. బీఆర్ఎస్‌లో టెన్షన్!

బీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు ఓ వైపు ఆ పార్టీకి నష్టం చేకూరేలా ఉండగా మరోవైపు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి పార్టీలోకి తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాల మాట పక్కన పెడితే పార్టీ అధినేతే ఇక్కడ పోటీలో ఉండటంతో విబేధాలతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్న ప్రచారం సాగుతోంది. ఇదే కంటిన్యూ అయితే అధినేత ఓటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ నాయకులే కారణమవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నాయి.


Next Story

Most Viewed