పదేళ్ల పగ.. ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

by Sathputhe Rajesh |
పదేళ్ల పగ.. ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : పదేళ్లుగా రగులుతున్న పాత కక్షలు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నారాయణపేట జిల్లా అభంగాపూర్ గ్రామానికి చెందిన అశోక్ అలియాస్ ఆశన్న ముదిరాజ్ (60), బుగ్గ విజయ్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మొదట్లో ఇరువురు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి.. కొన్ని కారణాలవల్ల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. వీరి మధ్య ఆరంభమైన విభేదాలు కుటుంబాల మధ్య కక్షలు రేపాయి. ఈ క్రమంలో విజయ్ కుమార్‌కు సంబంధించిన వారు ఆర్టీసీ బస్సులో వెళుతుండగా కొంతమంది వారిని వెంటాడి హత మార్చారు. అందుకు ప్రధాన కారకుడు అశోక్ అలియాస్ ఆశన్న అని భావించి అప్పట్లో విజయ్ కుమార్ సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనతో ఆశన్న తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. రెండున్నర సంవత్సరాల క్రితం నారాయణపేట కోర్టుకు హాజరై తిరిగి వెళుతుండగా ప్రత్యర్థులు మరికల్ మండల కేంద్రానికి సమీపంలో అడ్డగించి కత్తులతో దాడి చేశారు. అరుపులు విని స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆశన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుండి ప్రత్యార్థులకు దొరకకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆశన్న హైదరాబాద్ నాగారం వద్ద సొంత ఇంటిని కట్టుకొని ఉంటున్న విషయాన్ని ప్రత్యర్థులు గుర్తించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తన ఇంటి వద్ద ఉన్న ఆశన్నను గుర్తించి కొంతమంది నెంబర్ లేని కారులో ఆయుధాలతో వచ్చి హతమార్చి పరారు అయినట్లు సమాచారం. ఆశన్న హతమైన విషయం తెలియడంతో నారాయణపేటతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story