ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ రిక్వెస్టు

by Gantepaka Srikanth |
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ రిక్వెస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, తిరుమల వేంకటేశ్వర ఆలయం సహా దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎంకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిక్వెస్టు చేశారు. గత ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చినా వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం పరిగణనలోకి తీసుకోలేదని, భక్తులకు దర్శనాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. ఈసారి అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా తెలంగాణ ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు) ఇచ్చే సిఫారసు లేఖలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళి కలిసి ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించగా సానుకూల స్పందన వచ్చింది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి ఈ రిక్వెస్టు వెళ్ళడం గమనార్హం. తెలంగాణ ప్రజలకు తిరుమల ఆలయంలో దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమమైంది. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి స్థానం లభించే అవకాశం కూడా ఉన్నది. ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు ఓపెన్‌గా చెప్పినందున దర్శనాలకు రానున్న రోజుల్లో సమస్యలు ఉండవనే అభిప్రాయం నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed