తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు

by GSrikanth |
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టుకు త్వరలో ఇద్దరు కొత్త జడ్జీలు రానున్నారు. ప్రస్తుతం అదనపు జడ్జీలుగా ఉన్న జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులను పూర్తి స్థాయి హైకోర్టు జడ్జీలుగా రాష్ట్ర హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలకు గవర్నర్, ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీంతో వీరిద్దరి పేర్లు సుప్రీంకోర్టుకు చేరాయి. తెలంగాణ హైకోర్టు వ్యవహారాలను చూస్తున్న సుప్రీంకోర్టు జడ్జీకి ఈ ప్రతిపాదనలను పంపి ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. దీనికి తోడు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల కమిటీ కూడా వీరిద్దరి పేర్లను పరిశీలించింది. ఇప్పటివరకు అదనపు జడ్జీల హోదాలు వారు వెలువరించిన తీర్పులు, వారి పని తీరు తదితరాలను పరిశీలించి వారిద్దరికీ ‘గుడ్’ రేటింగ్ ఇచ్చినట్లు సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నిర్వహించిన సమావేశం తర్వాత వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టు కొలీజియం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు జస్టిస్ జే. శ్రీనివాసరావు, జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు ట్రాక్ రికార్డులను జడ్జిమెంట్ ఎవాల్యూయేషన్ కమిటీ కూడా విశ్లేషించింది. వీరిద్దరూ హైకోర్టుకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి పొందడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని సుప్రీంకోర్టు కోలీజియంకు స్పష్టం చేసింది. అన్ని స్థాయిల్లోని కమిటీల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ జే.శ్రీనివాసరావు, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావులను తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి జడ్జీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులను పంపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరిద్దరి నియామకానికి సంబంధించిన గెజిట్ జారీ కానున్నది.

Advertisement

Next Story

Most Viewed