తెలంగాణలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌ జారీ

by Nagaya |
తెలంగాణలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌ జారీ
X

దిశ, కామారెడ్డి : నాలుగేళ్ల తర్వాత స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు షెడ్యూల్‌ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2019లో ఎస్‌ఎంసీలను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేయగా కొవిడ్‌ తదితర కారణాలతో ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. పాత కమిటీలనే పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, సంక్షేమ శాఖలకు సంబంధించి 1078 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.

ఎస్‌ఎంసీ షెడ్యూల్‌ ఇలా..

ఎస్‌ఎంసీ ఎన్నికకు పాఠశాలల్లో శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు జాబితాను ప్రదర్శించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 22వ తేదీ వరకు స్వీకరించి.. 24న తుది జాబితా విడుదల చేస్తారు. ఇక 29వ తేదీన ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఎస్‌ఎంసీల బాధ్యతలివే..

పాఠశాలల్లో హాజరుశాతం పెంపు, మధ్యాహ్న భోజనం అమలు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీని కమిటీలు పర్యవేక్షిస్తాయి. కొత్త కమిటీలతో మన ఊరు – మన బడి పనుల్లో వేగం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకు సిద్ధం: డీఈవో రాజు

జిల్లాలో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లతో జాబితా విడుదల చేశాం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story