- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
GO నెం 111 రద్దు వెనుక భారీ స్కెచ్.. ఆ భూములకు లైన్ క్లియర్ చేసేందుకే సర్కార్ కొత్త వ్యూహం..?

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల భారాన్ని మోసేందుకు భూముల అమ్మకాన్ని మొదలు పెట్టింది. హైదరాబాద్ చుట్టూ దాదాపుగా అమ్మేసింది. ఇప్పుడు వేలం వేసేందుకు కనుచూపు మేరలో అనువైన స్థలాలేవీ లేవు. కానీ జీఓ 111 రద్దుతో వేలాది ఎకరాలు అమ్ముకునేందుకు ప్రభుత్వానికి రూట్ క్లియర్ అయింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ కి పక్కనే ఇన్నాళ్లు ఆంక్షల మధ్యన కొట్టుమిట్టాడుతున్న భూములకు విలువొచ్చింది.
ఇంకా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ కి 30 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలోనే సర్కారు స్థలాలు ఉండగా, వాటి జాబితాను అధికారుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే మెయినాబాద్, శంకర్ పల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్ మండలాల్లో అనువైన స్థలాలను వేలం వేసి రూ.వేల కోట్ల సొమ్మును ఖజానాకి చేర్చే వీలు కలిగింది. ఈ సొమ్ముతోనే రానున్న ఎన్నికల కంటే ముందే పలు కొత్త స్కీంలను అమలు చేయవచ్చన్న వ్యూహంతోనే జీఓ 111 రద్దు చేసినట్లు చర్చ జరుగుతున్నది.
ఔటర్ పక్కనే భూములు
– ఔటర్ రింగ్ రోడ్డు దిగగానే చిలుకూరు కంటే ముందే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా చిలుకూరు భూముల మధ్యనే ఏర్పాటైంది. అక్కడి నుంచి చేవెళ్ల దాకా, ఇటు బుద్వేలుతో పాటు శంషాబాద్ మండలంలోని జీవో 111 పరిధిలోని గ్రామాల్లోనూ అనేక సర్కారీ భూములు ఉన్నాయి.
– మెయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో సర్వే 149లో 155.29 ఎకరాల గైరాన్ సర్కారీ, 202, 203లో 20 ఎకరాల భూదాన్, 218/1లో 173 ఎకరాల గైరాన్ సర్కార్.. ఇంకా సీలింగ్, అసైన్డ్ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి.
– శంకర్ పల్లిలో సర్వే నం.191లో 213 ఎకరాలు, కొండకల్ లో 219 ఎకరాలు, పొద్దుటూరులో 350 ఎకరాలు, ఫతేపూర్ లో పెద్ద ఎత్తున పొరంబోకు భూములు ఉన్నాయి.
– శంకర్ పల్లి మండలం శంకర్ పల్లి ఖల్సా, శంకర్ పల్లి పాయిగా, అంతప్పగూడ, పర్వేద చంచలంలో సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయి. టంగుటూరు, రావులపల్లి కలాన్, ఎర్వగూడ, మాసానిగూడల్లోనూ ప్రభుత్వ భూములు ఉన్నాయి.
– శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోనూ సర్కారీ భూములు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ దర్శనమిస్తున్నాయి. సిటీకి సమీపంలో ఇప్పటికే అమ్మకాలు పూర్తి కావచ్చాయి. వీటిని కూడా అమ్మేందుకు అవకాశాలు లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
భూముల అమ్మకాల ద్వారానే..
సంవత్సరాలుగా భూముల అమ్మకాల ద్వారానే ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్‌కి మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు అక్కడి భూములకు విలువను పెంచేందుకేనన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ బుద్వేల్‌లో ప్రభుత్వం భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. మొదట 182 ఎకరాల్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎకరాల వరకు ఉండే అవకాశం ఉన్నది. మొదటి దశలో 60.08 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడు ప్లాట్లను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు.
రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ సర్వే నం.283/పీ, 284/పీ, 287/పీ, 288/పీ, 289, 290, 291, 292, 293, 294, 205, 296, 297, 298, 299/పీ లలో ఈ స్థలాలు ఉన్నాయి. ఓ వైపు రింగ్ రోడ్డు, మరోవైపు హిమాయత్ సాగర్.. పక్కనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండడంతో ఈ లే అవుట్‌కి అత్యంత ప్రాధాన్యత లభించనుంది. ఈ భూముల అమ్మకం ద్వారా రూ.వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు జీవో 111 రద్దుతోనూ వందలాది ఎకరాలను డెవలప్ చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. ఆంక్షల మధ్యనే అమ్మేస్తే రూ.లక్షల్లోనే విలువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఎకరం బంగారు పంటను పండించడం ఖాయం. పైగా ఓఆర్ఆర్‌కి పక్కనే భూములు ఉన్నాయి.
పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన పెద్దలు
గతేడాది ఏప్రిల్‌లో జీవో 111ను క్రమక్రమంగా రద్దు చేస్తామని ప్రభుత్వం జీవో 69ని జారీ చేసింది. అప్పటి నుంచే 84 గ్రామాల్లో భూములకు రెక్కలు వచ్చాయి. సామాన్యులెవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా ధరలు పెరిగిపోయాయి. దీంతో బడా సంస్థలు, ప్రజాప్రతినిధులు ఎంట్రీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి బంధుగణం, పలు రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాయి. ప్రధానంగా మెయినాబాద్ మండలం హిమాయత్ నగర్, అజీజ్ నగర్, పెద్ద మంగళారం, ఎనికెపల్లి, రెడ్డిపల్లి, చిలుకూరు నాగిరెడ్డిగూడ ప్రాంతంలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఓ బడా సంస్థ మెయినాబాద్ లోనే 50 ఎకరాలు కొనుగోలు చేసింది.
దాంట్లో కొందరు పెద్ద ప్రజాప్రతినిధులు బినామీగా ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తున్నది. మరో ఎంపీ ఎనికెపల్లిలో 84 ఎకరాలు కొన్నట్లు సమాచారం. అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పారు. నాగిరెడ్డిగూడలో ఓ ఎమ్మెల్సీకి 9 ఎకరాలు, మొయినాబాద్‌లో ఓ మంత్రికి 13 ఎకరాలు, రెడ్డిపల్లిలో మాజీ ఎంపీకి 100 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. మొయినాబాద్ మండలంలోనే ఎంతో మంది నేతలకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఫామ్ హౌజ్ ల పేరిట విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్నారు. రహస్య రాజకీయ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే నిర్వహిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, పార్టీ ఫిరాయింపు మతలబులకు వేదికలుగా మారాయి.