- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొమ్మిదేళ్లుగా బీసీలపై ప్రభుత్వం వివక్ష.. గంగలో కలిసిన సీఎం కేసీఆర్ హామీ!
బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. సబ్సిడీ రుణాలు మొదలు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ వరకు ప్రతి విషయంలోనూ మోసం చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు తొమ్మిదేండ్లు కావస్తున్నా.. బడుగు, బలహీన వర్గాల జీవితాలు మారలేదని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చూపుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని 2017లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ దానిపై నేటికీ స్పష్టత లేదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలపై సర్కార్వివక్ష చూపుతూనే ఉన్నది. సబ్సిడీల నుంచి స్కాలర్‌షిప్‌ల వరకు ఆయా వర్గాలను మోసం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు తొమ్మిదేండ్లు కావస్తున్నా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని బీసీ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్న సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం లేదు. కలెక్టరేట్లు, బీసీ సంక్షేమ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బడెట్ లేదంటూ అధికారులు దాటవేస్తున్నారని బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు రూ.6 వేల కోట్లేనా..?
2014 నుంచి 2022 వరకు సబ్సిడీ రుణాల కోసం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.55,183.57 కోట్లు కేటాయించింది. అందులో రూ.17,231.75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇందులోనూ ఖర్చు చేసింది కేవలం రూ.6,078.09 కోట్లే. బడ్జెట్ లో కేటాయింపులను ఘనంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిధులను ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని దీంతో స్పష్టమవుతున్నది. ఎంబీసీలకు బడ్జెట్‌లో రూ.3,305 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. మంజూరు చేసిన మాత్రం రూ.1,928 కోట్లే. అందులోనూ ఖర్చు చేసింది రూ.601.51 కోట్టు మాత్రమే. మంజూరైన నిధులనూ అధికారులు పూర్తిగా ఖర్చు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. పైగా రాష్ట్ర జనాభాలో 54% ఉన్న బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ రూ.2 లక్షల 90 వేల కోట్లలో బీసీల సంక్షేమానికి రూ.5,960 కోట్లు మాత్రమే కేటాయించడం దీనికి నిదర్శనం.
బీసీ సబ్‌ప్లాన్ కుచట్టబద్ధత ఏది..?
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని 2017లో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ.. దీనిపై ఇప్పటి వరకూ చర్చే లేదు. బీసీ సబ్ ప్లాన్ అమలైతే బీసీలకు కేటాయించిన నిధులకు మరో రూ.10 వేల కోట్లు అదనంగా సమకూరేవని వెల్ఫేర్ అధికారులు తెలిపారు. మరోవైపు 2017లో ఏర్పాటైన ఎంబీసీ కార్పొరేషన్ అలంకారప్రాయంగా మారింది. ఈ కార్పొరేషన్ కు ప్రతి బడ్జెట్‌లోనూ రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. 2018-19లో 75% , 2020-22లో 100% నిధులు ఖర్చు చేయకుండా మోసగించిన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక చేనేత రంగానికి 2018-19లో కేటాయించిన రూ.722 కోట్లలో 40% నిధులను ఖర్చు చేయలేదు. నాయీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీల ఫెడరేషన్‌కు 2017-18లో కేటాయించిన నిధుల్లో 91% నిధులు ఖర్చు చేయలేదు. 2018-19లో కేటాయించిన నిధుల్లో 86% ఖర్చు చేయలేదు. రజక కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌కు 2018-19లో కేటాయించిన నిధుల్లో 73% ఖర్చు చేయలేదు. తర్వాత ఆ సొసైటీకి నిధులే కేటాయించలేదు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ గోస..
రాష్ట్రంలో బీసీల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20లో ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌కు కేటాయించిన రూ.299 కోట్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. 2021-22లోనూ ఈ స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించిన రూ.254.19 కోట్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక ప్రభుత్వ హాస్టల్స్‌కు 2018-19లో కేటాయించిన నిధుల్లో 36%, 2020-21లో 61%, 2021-22లో 81% నిధులు ఖర్చు చేయలేదు. వెనుకబడిన వర్గాల రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజీల సొసైటీకి 2018-19లో చేసిన కేటాయింపుల్లో 46% ఖర్చు చేయలేదు. 2020-21లో 74%, 2021-22లో 54% నిధులు ఖర్చు చేయలేదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బీసీ బంధు ఏది..?
దళితబంధు తరహాలో బీసీ బంధు పథకం ప్రారంభిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలింది. సబ్సిడీ రుణాల కోసం లక్షలాది మంది బీసీలు దరఖాస్తు చేసుకొని ఐదేండ్లుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ సుష్క వాగ్దానంగానే మిగిలింది. బీసీల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఉద్యోగ, రాజకీయ నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
జనాభా ప్రతిపాదికన న్యాయం చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేసింది. ఆ వివరాలు వెల్లడించని సర్కారు.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, నిధులను జనాభా ప్రకారం బీసీలకు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నది. బడ్జెట్‌లో బీసీలకు 2.3% నిధులే కేటాయిస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 18%కు కుదించింది. రాష్ట్ర జనాభాలో 50%కు పైగా బీసీలు ఉన్నారు. కానీ, రాష్ట్ర కేబినెట్‌లో బీసీ మంత్రులు ముగ్గురే ఉండటం బాధాకరం. చేనేత పొదుపు పథకం నిలిచిపోయింది. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామన్న జీవో అటకెక్కింది. ఎంబీసీ జాబితాలో చేర్చాలని 15 కులాల వారు ఎన్నేళ్లుగా కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దోబీఘాట్‌లు, డ్రైయింగ్ మిషన్లు, మోడ్రన్ సెలూన్లు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది..? - జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు