- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సీనియర్ల కొత్త నినాదం.. రేవంత్ రెడ్డికి మరో బిగ్ షాక్!
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ కమిటీల నియామకం సీనియర్ల తిరుగుబాటుకు వేదికగా మారింది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్న సీనియర్లంతా ఒక్కటయ్యారు. శనివారం సీఎల్పీ నేత భట్టి నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ఒక్కొక్కోరుగా సమావేశమయ్యే పరిస్థితి నుంచి సీనియర్ల ఉమ్మడి సమావేశం వరకు పరిస్థితి వచ్చింది. అయితే, ఇటీవల టీపీసీసీ కమిటీల్లో పదవులు వచ్చిన అంశంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, దీనిపై అటు ఏఐసీసీ నుంచి, ఇటు టీపీసీసీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో సీనియర్లు మరింత రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక సమావేశాన్ని నిర్వహించారు.
సేవ్ కాంగ్రెస్ నినాదం
రేవంత్ సారథ్యంలోని టీపీసీసీ కమిటీలు వాస్తవ కాంగ్రెస్ కాదంటూ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'సేవ్ కాంగ్రెస్ నినాదం'తో ఏఐసీసీ ముందు తేల్చుకోవాలని అసంతృప్తుల భేటీలో నిర్ణయించారు. ఇప్పుడు సమావేశమైన వారే అసలు కాంగ్రెస్ వాదులంటూ సీనియర్లు ప్రకటించారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడుపుతున్నారని, పార్టీని కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో శుక్రవారం ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుతో పాటుగా పలువురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉన్నటువంటి అసలైన కాంగ్రెస్ వాదులను కాపాడుకోవడానికి సేవ్ కాంగ్రెస్ నినాదంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి వెల్లడించారు. దీని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి సుమారు రెండు గంటలకు పైగా లోతుగా చర్చించుకున్నామన్నారు.
కాంగ్రెస్ను వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది : భట్టి
కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడుతామని, పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాకపోవడం బాధాకరమని, ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానన్నారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీన పరుస్తున్నారని, కాంగ్రెస్‌కు మూల స్తంభాలుగా ఉన్న సీనియర్ నాయకుల క్యారెక్టర్లు బద్నాం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత ఏడాదిన్నర కాలం నుంచి కుట్ర పూరితంగా బలమైన నాయకులను బలహీనపరిచి పార్టీని హస్తగతం చేసుకోవడానికో, మరొకరికి అప్పజెప్పేందుకో కుట్ర జరుగుతుందని, సోషల్ మీడియా ద్వారా బలమైన నాయకులను బలహీనపరచడం వల్ల దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడి పార్టీ బలహీనంగా మారే ప్రమాదం ఉందన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు తనతో చెప్పారని, అయితే కమిటీల నియామకంలో తాను పాలుపంచుకోలేదన్నారు. ఈ కమిటీల్లో తన అభిప్రాయం కూడా తీసుకోలేదని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని, దేశవ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటామని చెప్పారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీల్లో దశాబ్దాలుగా సేవ చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు చోటు కల్పించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు.
నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడట: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు సేవ్కాంగ్రెస్నినాదంతో ముందుకెళ్తామని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమంతా చర్చించుకున్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా ఉంటుందని, కానీ ఇప్పటి పరిస్థితులు మరింత దారుణంగా మారాయని, పార్టీని ఒక్కరే దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారన్నారు. టీపీసీసీ కమిటీల్లోని 180 మందిలో 54 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని, ఇది కాంగ్రెస్‌కు మంచిదికాదన్నారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు టీఆర్ఎస్ కోవర్టులని తీన్మార్ మల్లన్నతో ఎవరు పోస్టింగ్ పెట్టించారని, తామంతా పార్టీని కాంగ్రెస్‌ను నాశనం చేస్తే.. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని ప్రశ్నించారు. తానెప్పుడూ తన వాళ్లే పదవుల్లో ఉండాలని భావించలేదని, 33 జిల్లాల అధ్యక్షుల మార్పులు చేస్తే కొంతమందిని అవమానించినట్టేనని, గెలిచేచోట ఏకాభిప్రాయం జరుగలేదుకానీ ఓడిపోయే చోట ఏకాభిప్రాయం కుదిరిందా అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కమిటీల్లో వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఒరిజినల్ నేతలను బాధిస్తున్నదని, అసలైన నేతలపై కోవర్టుల ముద్ర వేస్తున్నారన్నారు. తీన్మార్ మల్లన్న ఏ పార్టీ వ్యక్తి అని, ఆయనకు డబ్బులు ఇచ్చి ఈ పోస్టింగ్‌లు ఎవరు పెట్టించారని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేసినప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిశామని, టీఆర్ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్ నాయకులపై కూడా దుష్ప్రచారం జరిగే విధంగా పోస్టింగులు తయారు చేస్తున్నారని మాకు తెలిపారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకుపోతామన్నారు.
పార్టీలు మారిన చరిత్ర మాది కాదు : దామోదర రాజనర్సింహా
రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహా అన్నారు. అందరితో మమేకమవుతూ, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని, పార్టీని పెంచే దిశగా తాము ఎప్పుడూ ప్రయత్నం చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తమను తప్పుపడుతున్నారని, నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదంటూ వ్యాఖ్యానించారు. తాము కాంగ్రెస్‌లో పుట్టామని, కాంగ్రెస్‌లోనే పెరిగామని, కాంగ్రెస్‌లోనే చస్తామన్నారు.
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: మధుయాష్కి
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర ఈ పార్టీలోనే జరుగుతుందని, వలస వచ్చిన నేతలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి మండిపడ్డారు. కనీసం క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందని, ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. తమపై తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, సోషల్ మీడియా ఖబర్దార్ అని హెచ్చరించారు.
కోవర్టులు వలస నేతలే: జగ్గారెడ్డి
కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన నేతలతోనే కోవర్టులు అనే పదం వినిపిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తేనే సిద్ధిపేట, ఖమ్మం జిల్లాలో పోటీలో నిలబడి కాంగ్రెస్ ఉనికి కాపాడామన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న తాము కోవర్టులమా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా వలస నాయకుడు కనీసం ఖండించడం లేదని సెటైర్లు వేశారు.