ఎన్నికల ఏడాదిలో చిక్కుల్లో కాంగ్రెస్.. ఏలేటి బాటలో మరి కొంతమంది నేతలు?

by GSrikanth |
ఎన్నికల ఏడాదిలో చిక్కుల్లో కాంగ్రెస్.. ఏలేటి బాటలో మరి కొంతమంది నేతలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ఏడాదిలో తెలంగాణల కాంగ్రెస్‌లో మరోసారి ముసలం ముదిరింది. ఆ పార్టీ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే ఏలేటి రాజీనామాతో మరోసారి పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్‌గా మారారు. రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉందని ఎకతాటిపైకి రావడం ఈ ఇద్దరికీ సాధ్యం కాలేదనేది పార్టీలో జరుగుతున్న చర్చ. గతంలో పాదయాత్రల విషయంలోనూ తలో దారిలో పయనించడం దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కొత్త ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే కలగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంతలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై సోషల్ మీడియాలో కథనాలు రావడం, వాటిపై పార్టీ షో కాజ్ నోటీసులు ఇవ్వడం చకచక జరిగిపోయాయి. దీంతో మనస్థాపం చెందిన మహేశ్వర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు.

ఇదిలా ఉంటే మహేశ్వర్ రెడ్డి దారిలో మరి కొంతమంది సీనియర్లు పయణిస్తారా అనే చర్చ తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. పీసీసీ కమిటీల నియామకం సమయంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కిన నేతలలో అనేక మంది ప్రస్తుతం పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ముఖ్యంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు మరి కొంతమంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో మరి కొందరు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే కూడా కనీసం రియాక్ట్ కూడా కాలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వీరి మౌనం వెనుక రేవంత్ రెడ్డిపై అసంతృప్తినే అసలు కారణం అనే చర్చ జరుగుతున్నది.

దీంతో రేవంత్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నావాళ్లు ఏలేటి బాటలోనే వెళ్తారా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచన ఉంటే ఎవరెవరు కండువా మార్చబోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోందట. వీరిలో అనేక మంది ప్రసుతానికి పార్టీలో కొనసాగినా ఎన్నికల నాటికి ఇతర పార్టీలో చేరడం ఖాయం అనే ఊహాగాలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీజేపీ నేతలు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed