షాద్‌నగర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

by Mahesh |
షాద్‌నగర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: షాద్‌నగర్ ఓ చోరి కేసులో భార్య, భర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దళిత మహిళ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తారా అంటూ సీఎం పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాదికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారు ఎవరు తప్పించుకోవాలని.. అందరికీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటుగా బాధితులకు అండగా ఉంటామని హామి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే షాద్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా.. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు దళిత మహిళను స్టేషన్ తీసుకొచ్చారు. తప్పును ఒప్పుకోవాలని.. కన్న కొడుకు ముందు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. అనంతరం ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిని ఫిర్యాదు దారుడి కారులోనే ఆమె ఇంటి ముందు దించివచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసుల తీరుపై రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed