రాష్ట్రంలో ‘ట్యాక్స్’ పాలిటిక్స్ దుమారం.. తాజా ఆరోపణల వెనుక కొత్త కోణం!

by Prasad Jukanti |
రాష్ట్రంలో ‘ట్యాక్స్’ పాలిటిక్స్ దుమారం.. తాజా ఆరోపణల వెనుక కొత్త కోణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో లోక్‌సభ పోలింగ్ ముగిసినా అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై రోజుకో కొత్త ‘ట్యాక్స్’ ఆరోపణలు తెరపైకి రావడం సంచలనం రేపుతున్నది. తొలుత ఆర్ఆర్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారని ఆరోపించిన బీజేపీ నేతలు.. ఆ తర్వాత బీ ట్యాక్స్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తాజాగా యూ ట్యాక్స్ పేరు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణలు ఇతర బీజేపీ నేతలు చేస్తే అంతా పట్టింపు ఉండేది కాదేమో కానీ మొన్నటి వరకు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించి ఆ పార్టీ గురించి పూర్తిగా తెలిసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ ఆరోపణలు చేస్తుంటడంతో అసలేం జరుగుతోందనే చర్చ తెరమీదకు వస్తోంది. ఏలేటి ఆరోపణల వెనుక మైండ్‌గేమ్ ఉందా లేక మరేదైనా మర్మం ఉందా అనేది సస్పెన్స్‌గా మారింది.

ప్రధాని ఎంట్రీతో మరింత రంజుగా..

రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించగా ఇదే ఆరోపణలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఈ ట్యాక్స్ వ్యవహారం దుమారంగా మారింది. ఒక ఆర్ తెలంగాణను దోచి ఢిల్లీలో ఉన్న మరొక ఆర్‌కు దొడ్డిదారిన ముట్టజెప్పుతున్నాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిడుగు పేల్చారు. రాష్ట్రంలో తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయవద్దనే ఉద్దేశంతో ఓ మంత్రి బీ ట్యాక్స్‌కు తెరలేపారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి బిల్లుల్లో 8-9 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై చర్చ ఆగకముందే తాజాగా యూ ట్యాక్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తం రూ. 950 కోట్లు వసూలు చేసి అందులో రూ.500 కోట్లు కేసీ వేణుగోపాల్‌కు చేరవేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే సీఎం రేసులో తాను ఉన్నానని అనిపించుకోవడానికే ఉత్తమ్ ఇలా చేశారని పేర్కొన్నారు.

తాజా ఆరోపణల వెనుక కొత్త కోణం..

ఇప్పటివరకు దోపిడీ అనే అంశాన్ని టార్గెట్ చేసిన బీజేపీ అనూహ్యంగా యూ ట్యాక్స్ విషయం వచ్చేసరికి కొత్త కోణాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి పదవి రేసును ప్రస్తావించడం ఆసక్తిగా మారుతోంది. అసలే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పదేపదే ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన యూ ట్యాక్స్ ఆరోపణల వెనుక మతలబు ఏంటనే చర్చ మొదలైంది. అయితే ఈ ట్యాక్స్‌ల విషయంలో వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. డబుల్ ఆర్ ట్యాక్స్‌పై మోడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ అవినీతి కేసులో నోటీసులు వచ్చిన వారందరికీ మోడీ తన పక్కన ఆశ్రయం కల్పిస్తూ తమపై అపవాదులు వేస్తున్నారని గతంలో ధ్వజమెత్తారు. అయినా బీజేపీ వైపు నుంచి ఈ తరహా ట్యాక్స్ ఆరోపణలు ఆగలేదు. బీజేపీ చేస్తున్న ట్యాక్స్ ఆరోపణలకు భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ మేరకు చెక్ పెడుతుందో చూడాలి.

Advertisement

Next Story