Cyber Crime:టార్గెట్.సీనియర్ సిటిజన్స్! రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-13 02:36:55.0  )
Cyber Crime:టార్గెట్.సీనియర్ సిటిజన్స్! రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి కొంతకాలం కిందట హోం లోన్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడు. ఆ తర్వాత అతడికి రెండు రోజులకే ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను రిలయన్స్ క్యాపిటల్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పిన ఆ వ్యక్తి.. తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు. రిజిస్ర్టేషన్, ప్రాసెసింగ్, కాంటింజెన్సీ డెవలప్‌మెంట్ చార్జీలు, జీఎస్టీ, ఐటీ.. ఇలా రకరకాల పేర్లతో కొన్నిరోజుల వ్యవధిలో సదరు రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 30 లక్షల వరకు కాజేశాడు.

రుణం ఇప్పించకుండా డబ్బుల మీద డబ్బులు అడుగుతుండటంతో మోసపోయినట్టుగా గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఈ తరహా సైబర్ మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ క్రిమినల్ సీనియర్ సిటిజన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. హోంలోన్స్, ఇన్సూరెన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతో ఉచ్చులోకి లాగుతున్నారు. వారి నుంచి రూ. లక్షలు కొల్లగొడుతున్నారు.

అవగాహన లేకే..

ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న మోసాలపై సీనియర్ సిటిజన్లకు సరైన అవగాహన లేకపోవడంతోనే సైబర్ క్రిమినల్స్ వారిని టార్గెట్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. హోమ్ లోన్స్, వర్క్ ఫ్రమ్ హోం, ఆకర్షణీయమైన జీతాలు అంటూ ఉచ్చులోకి లాగుతున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా తాము పంపించే వీడియో లింకులకు లైక్ కొడితే చాలు... ఊహించనంత డబ్బు చేతికందుతుందని మోసాలు చేస్తున్నట్టు వివరించారు. కాగా, రుణం పేరిట రూ. 30 లక్షలు కొల్లగొట్టిన కేసులో నలుగురు నిందితులను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించినపుడు దేశవ్యాప్తంగా సుమారు 30 మందిని ఇలాగే మోసం చేసి నెల రోజుల వ్యవధిలోనే రూ. 5 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించామని సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.

వాట్సాప్ వీడియో కాల్స్‌తో..

సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ వీడియో కాల్స్‌తో కూడా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలతో వీడియో కాల్ చేయించి అవతలి వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకోగానే రికార్డు చేస్తున్నారు. ఇలా రికార్డు చేసిన వీడియోలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. డబ్బు ఇవ్వపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరిస్తుండడంతో ఈ వయసులో పరువు పోగొట్టుకోవటం ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు కూడా ఫిర్యాదులు చేయకపోవడంతో సైబర్ క్రిమినల్స్ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. రుణాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు తీసుకున్నా.. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినా, జాబ్ ఫ్రం హోం అంటూ మోసం చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా నిందితులను పట్టుకునే అవకాశాలుంటాయని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed