మోడీ సభ సక్సెస్ చేయడంపై బీజేపీ ఫోకస్.. టార్గెట్ ఇదే!

by Sathputhe Rajesh |
మోడీ సభ సక్సెస్ చేయడంపై బీజేపీ ఫోకస్.. టార్గెట్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభను సక్సెస్ చేయడంపై బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడీ రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ సభకు లక్ష మందికిపైగా జనాన్ని తరలించేందుకు కాషాయదళం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, జనాన్ని తరలించాలని కమలం పార్టీ భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు కనీసం 20 బస్సులను పంపించి జనాన్ని తరలించాలని ప్లాన్ చేసుకుంది. వచ్చే సంఖ్యకు అనుగుణంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు సైతం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్‌తో అమీ తుమీ తేల్చుకోవాలంటే ఈ సభ ద్వారా తమ సత్తా ఏంటో చాటాలని బీజేపీ పట్టుదలతో ఉంది.

ప్రతిష్టాత్మకంగా బహిరంగసభ

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కమలం పార్టీ నేతలు, కార్యకర్తలపై అరెస్టులు, దాడులతో ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోడీ సభను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే భారీగా జన సమీకరణ చేపట్టాలని డిసైడైంది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. బండి సంజయ్ అరెస్ట్, బెయిల్ పరిణామాలతో పాటు సభను సక్సెస్ చేయడంపై డిస్కషన్ చేశారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా తొలుత తిరుపతి- సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ను మోడీ ప్రారంభిస్తారు. అనంతరం రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య రూ.1,410 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిన 85 కిలోమీటర్ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్‌ను మోడీ జాతికి అంకితం చేస్తారు.

ఎంఎంటీఎస్ ఫేజ్-IIలో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-IIలో భాగంగా బొల్లారం-మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్లు, ఫలక్ నుమా-ఉందానగర్ మధ్య 14 కిలోమీటర్ల పొడవునా కొత్త డబ్లింగ్ లైన్లను జాతికి అంకితం చేస్తారు. రూ.1063 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పలు జాతీయ రహదారులను సైతం మోడీ జాతికి అంకింతం ఇస్తారు.

ప్రధాని పర్యటన ఇలా..

ఉదయం 11.30 : బేగంపేట విమానాశ్రయం

11:45 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు.

12:15 : పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

1:30 : బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ తిరిగి వెళ్తారు. మోడీ టూర్ మొత్తం రెండు గంటలపాటు కొనసాగనుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో..

కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుంచి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్ ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఈ స్టేషన్ నందు ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రైతిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పర్యటనకు భారీ బందోబస్తు

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ర్ట బలగాలు ఈ బందోబస్తులో పాల్గొంటున్నాయి. ప్రధాని పర్యటన సాగే మార్గంతోపాగు సభ నిర్వహించే పరేడ్ గ్రౌండ్‌ను పోలీసులు రెండు రోజుల ముందే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్, ఎన్‌డీఆర్ఐ, ఇండియన్ ఆర్మీఫోర్స్‌లతోపాటు రాష్ర్ట పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

ప్రధాని పర్యటన సాగే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని అణువణువూ గాలిస్తున్నారు. కేటీఆర్ ధర్నాలకు పిలుపునివ్వడంతో కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో వర్షం పడినా ఆటంకం లేకుండా ఉండేందుకు జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షకుపైగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో అందరికీ సరిడా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లెడ్ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 12 భారీ జనరేటర్లు అందుబాటులో ఉంచారు.

కాన్వాయ్ ట్రయల్ రన్

రేపు ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రానున్న సందర్భంగా ఈరోజు రూట్ రిహార్సల్ జరిగింది. ప్రధాని సెక్యూరిటీ ఎస్‌పీజీతో పాటు కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీ, పోలీస్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అన్ని విభాగాల అధికారులు, ట్రాఫిక్, మెడికల్ విభాగాలకు సంబంధించిన వారు ఈ రిహార్సల్‌లో పాల్గొన్నారు. రూట్ రిహార్సల్‌లో కాన్వాయ్ అక్కడక్కడా అగుతూ భద్రతను పర్యవేక్షిస్తూ రసూల్‌‌పుర, పరేడ్ గ్రౌండ్, సంగీత్, వొలిఫెంటా బ్రిడ్జి బోయిగూడ ఎంట్రెన్స్ ద్వారా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed