బిగ్ న్యూస్: తెలంగాణ యువత, నిరుద్యోగులే టార్గెట్‌గా T- కాంగ్రెస్ బిగ్ స్కెచ్!

by Satheesh |   ( Updated:2023-05-07 00:30:11.0  )
బిగ్ న్యూస్: తెలంగాణ యువత, నిరుద్యోగులే టార్గెట్‌గా T- కాంగ్రెస్ బిగ్ స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ​పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల రూ.3501 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నది.జాబ్ వచ్చే వరకు వీటిని పంపిణీ చేయాలని పార్టీ ఇంటర్నల్‌గా నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక విధి, విధానాలను తీసుకువచ్చి నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలనేది పార్టీ లక్ష్యం. ఇటీవల జరిగిన టీపీసీసీ కార్యవర్గంలోనూ నిరుద్యోగ భృతిపై నేతలంతా గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

ఏఐసీసీ కూడా ఎలాంటి అబ్జక్షన్ ​చేయలేదని ఓ నేత తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులను కాంగ్రెస్‌కు మరింత దగ్గర చేసే అవకాశం ఉన్నదని ఆ పార్టీ ​నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ హామీని బీఆర్ఎస్​(గతంలో టీఆర్ఎస్​) 2018లోనే తన మ్యానిఫెస్టోలో పొందు పరిచింది. ఒక్కో నిరుద్యోగికి రూ.3016 ఇస్తామని పేర్కొన్నప్పటికీ, ఇప్పటి వరకు అమలు కాకపోవడం గమనార్హం.

దీంతో బీఆర్ఎస్​హామీ కంటే అదనంగా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. అయితే కాంగ్రెస్​పార్టీకి అనవాయితీగా వస్తున్న లక్కీ నంబరు ‘9’ ఆధారంగా నిరుద్యోగ భృతిని ఫిక్స్​చేసినట్లు సమాచారం. ఈ తొమ్మిది ప్రభావం కాంగ్రెస్‌పై చాలా ఉన్నదని, వైస్సార్​సమయంలోనూ 9 అంకె సెంటిమెంట్​ఉండేదని కాంగ్రెస్​నేతలు చెబుతున్నారు. అందుకే నిరుద్యోగ భృతిని 9 అంకెలకు కలిసేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాగానే దీన్ని పక్కాగా అమలు చేయాలని పార్టీ లోని నేతలంతా బలంగా డిమాండ్ చేస్తున్నారు.

దీంతో పాటు యువత, నిరుద్యోగులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు సాగనున్నది. ఈ మేరకు ఈ నెల 8న హైదరాబాద్​సరూర్​నగర్‌లో జరిగే నిరుద్యోగ నిరసన సభలో కాంగ్రెస్​అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. బీఆర్ఎస్​నేరవేర్చని హామీలతో పాటు కొన్ని కొత్త నిర్ణయాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు. రైతు, యువత రాజ్యం దిశగా కాంగ్రెస్​అడుగులు వేస్తోన్నదని, ఆ దిశగానే నిరుద్యోగ డిక్లరేషన్​ఉంటుందని కాంగ్రెస్ సీనియర్​నేతల్లో ఒకరు తెలిపారు.

1.93 లక్షల జాబ్స్​టార్గెట్..

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు 1.93 లక్షల జాబ్స్​ఖాళీగా ఉన్నట్లు కాంగ్రెస్​పార్టీ గుర్తించింది. వీటిని అధికారంలోకి రాగానే విడతల వారీగా భర్తీ చేస్తామని డిక్లరేషన్​చేయనున్నారు. వార్షిక జాబ్స్ క్యాలెండర్​ప్రకటించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ప్రత్యేక సిస్టం ద్వారా జాబ్​రిక్రూట్ మెంట్ చేస్తామని పార్టీ హామీ ఇవ్వనున్నది. దీంతో పాటు ఉద్యోగ నియామకాల పరీక్షలను పకడ్భందీగా నిర్వహించేందుకూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్​లైన్, ఆఫ్​లైన్‌లో విధానాల్లో ఎక్కడా ఎగ్జామ్‌కు డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకోనున్నారు. రిక్రూట్మెంట్ కూడా ప్రత్యేక బోర్డు, డైరెక్టరేట్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో కాంగ్రెస్​ఉన్నదని నేతలు చెబుతున్నారు.

దీని వలన రిక్రూట్ మెంట్‌లు వేగంగా జరుగుతాయని కాంగ్రెస్​పార్టీ భావన. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఉన్నప్పటికీ, ప్రభుత్వం మానిటరింగ్ లేక రిక్రూట్మెంట్లలో నష్టం జరుగుతుందనేది కాంగ్రెస్​వాదన. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 110 నోటిఫికేషన్ల ద్వారా కేవలం 35,724 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పోర్టల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. రిజిస్టర్​కానీ వాళ్లతో కలిపితే దాదాపు 35 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాగానే వీళ్లందరికీ వేగంగా ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తామని కాంగ్రెస్​పేర్కొంటుంది.

కొత్త జిల్లా సమస్యలు..

గతంలోని10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన తర్వాత ఉద్యోగాల్లోనూ కొత్త చిక్కులు వచ్చాయి. నిత్యం ఉద్యోగులకు వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా స్టాఫ్​కొరతతో పని ఒత్తిడి పెరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని సర్కార్ గొప్పగా చెబుతున్నా.. వాటిలో పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. బదిలీలతో పాటు అడ్మినిస్ట్రేషన్​పరంగానూ ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇవన్నీ స్టాఫ్​లేమీతోనే వస్తున్నట్లు ఆయా డిపార్ట్​మెంట్లలో చర్చలు జరుగుతున్నాయి. దీంతో నోటిఫికేషన్లు వేగంగా ప్రకటించి ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్​పార్టీ నిర్ణయం తీసుకున్నది. జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్‌ల కమిటీను వేయనున్నట్లు కాంగ్రెస్​అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నది.

రైతుల కొరకు..

వరంగల్‌లోని రైతు డిక్లరేషన్‌కు నిరుద్యోగ డిక్లరేషన్‌ను క్రోడీకరిస్తే.. కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, రైతు భరోసా కోటాలో భూమి లేని, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం వంటివి ఇంప్లిమెంట్ చేయనున్నారు. దీంతో పాటు మద్ధతు ధర, తెలంగాణలో మూత పడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆయా రంగాల రైతులను ఆదుకోవడం కోసం పార్టీ తీసుకునే యాక్షన్​ప్లాన్‌ను ప్రియాంక గాంధీ వివరించనున్నారు.

పంట భీమాను పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయనున్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకురానున్నారు. ఇక రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన "రైతు కమిషన్" ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశాలను జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రియాంక సూచించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశాలను నెరవేర్చలేదని బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్​విమర్శల బాణాలను వదలనున్నది.

Advertisement

Next Story