మెడికో ప్రీతి ఆత్మహత్యపై స్పందించని మూర్ఖుడు సీఎం KCR: బండి సంజయ్ ఫైర్

by Satheesh |
మెడికో ప్రీతి ఆత్మహత్యపై స్పందించని మూర్ఖుడు సీఎం KCR: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మళ్లీ సీఎం అవుతారనే నమ్మకం కేసీఆర్‌కే లేదని, నమ్మకం ఉంటే టీఆర్ఎస్‌ను రద్దు చేసి కొత్త దుకాణం ఎందుకు తెరుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య జన్మదిన వేడుకల సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో అప్పులు తీరాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోయాయని బండి విమర్శలు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో హత్యలు, అత్యాచారాలు, ర్యాగింగ్‌లతో రౌడీలు రెచ్చిపోతున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కిన వ్యక్తి కేసీఆర్ అని సంజయ్ ధ్వజమెత్తారు.

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల భవిష్యత్‌ను సీఎం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులే చెబుతున్నాయని ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ద్వారా వేల కోట్ల దోచుకోవడం తప్ప ఒక్క చుక్క నీరు కూడా రాలేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టిన ద్రోహి కేసీఆర్ అని బండి విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధిపైనా, కేంద్రం ఇస్తున్న నిధులపైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా స్పందించని మూర్ఖుడు కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున కేసీఆర్ దోపిడీ చేశారని ఘాటు విమర్శలు చేశారు. గతంలో చేసిన అప్పులు తీర్చలేక కేసీఆర్ వాహనాలను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారని, అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత కేసీఆర్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయన్నారు.

మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్యపైనా, కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినా, ఆర్టీసీ ఉద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని మూర్ఖుడు కేసీఆర్ అని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం తాగడంతోనే బిజీగా ఉన్నారని, పంజాబ్ సీఎం ఆయనకు మంచి దోస్త్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ను మూతపడ్డ ఫైనాన్స్ దుకాణంగా బండి పేర్కొన్నారు. ఆ దుకాణానికి పెట్టిన కొత్త పేరే బీఆర్ఎస్ అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌లో చేరే వాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలేనని చురకలంటించారు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికి రాని నేతలే బీఆర్ఎస్‌లో చేరుతున్నారని బండి వ్యాఖ్యానించారు.

అయోధ్య నుంచి అగర్తల వరకు మోడీనే..

‌దేశంలో అయోధ్య నుంచి అగర్తాల వరకు ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతోందని బండి తెలిపారు. ఇస్త్తాంబుల్ నుంచి ఇస్లామాబాద్ దాకా యావత్ ప్రపంచమంతా మోదీ మేనియా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం దేశమంతా ఎదురుచూస్తోందని, కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ విజయ కేతనం ఎగరేయడంపై బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఆయన సమక్షంలో నేతలంతా టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈసందర్భంగా బండి మాట్లాడుతూ.. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయలేని పరిస్థితి ఉండేదని, తెల్ల జెండాలే పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ ఫలితాలతో కాషాయ జెండా దమ్ము చూపెట్టారని కొనియాడారు. ఈ విజయంతో కమ్యూనిస్టుల జాడ లేకుండా పోయిందన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మఠాషేనని విమర్శలు చేశారు.

Advertisement

Next Story