‘‘రూ.80 లక్షలు పెట్టండి.. రూ.1.20 కోట్లు తీసుకోండి’’.. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ నయా దందా..!

by Satheesh |   ( Updated:2023-07-14 06:04:40.0  )
‘‘రూ.80 లక్షలు పెట్టండి.. రూ.1.20 కోట్లు తీసుకోండి’’.. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ నయా దందా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇలా పెట్టుబడి పెట్టండి.. అలా రెట్టింపు అవుతుంది. 18 నెలల్లోనే 50 శాతం అదనంగా వచ్చేస్తుంది. మేం గ్యారంటీ.. నమ్మడం లేదా? మాకు అగ్రిమెంట్ చేయండి. మీ పేరిట ల్యాండ్ ఉంటుంది. పీడీసీ చెక్కులు ఇస్తాం తీసుకోండి.. ఇప్పుడు తప్పితే మరెప్పుడూ మీరు సంపాదించలేరు. ఇదే మంచి తరుణం మించిన దొరకదంటూ బై బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తూ రియల్ ఎస్టేట్ కంపెనీలు హడావిడి చేస్తున్నాయి. ఐతే ఏదో చిన్న కంపెనీ చేస్తుందనుకుంటే పొరపాటే.

రియల్ ఎస్టేట్ రంగంలోనే నంబర్ 1గా ప్రచారం అందుకున్న సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ వంటి కంపెనీ కూడా అదే దారిన నడుస్తున్నది. పైసా పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడమంటే ఇదే మరి! కస్టమర్లతో ల్యాండ్ కొనుగోలు చేయిస్తారు. ఆ ల్యాండ్‌ని డెవలప్మెంట్‌కి తీసుకొని లే అవుట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఏమిటి? బై బ్యాక్ ఆఫర్ అనుకున్న ప్రకారం చేయకపోతే పరిస్థితి ఏమిటి? పోస్ట్ డేడెట్ చెక్కులతో న్యాయ పోరాటానికి వీలవుతుందా? అసలు ఇలాంటి బై బ్యాక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టొచ్చునా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

30, 40 ఫీట్ల రోడ్లు, విద్యుత్తు వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఎందుకు తీసుకోవడం లేదు? ఫామ్ ల్యాండ్స్‌గా అమ్మేస్తూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవడం వెనుక ఆంతర్యేమిటో అంతుచిక్కడం లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. బై బ్యాక్ ఆఫర్లను నమ్మి పెట్టుబడి పెడితే 18 నెలల కాలంలోనే ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయన్న నమ్మకం లేదంటున్నారు. కంపెనీ ప్రకటించిన రేట్లకు, రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. అందుకే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

నంబర్ 1.. మరి అనుమతులేవి?

మాది క్రెడాయ్, ట్రెడాలో సభ్యత్వం కలిగిన సంస్థ. ఐఎస్‌వో 9001:2016 సర్టిఫికేట్ కూడా వచ్చింది. 25 వేల మందికి పైగా విలువైన కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల్లోనే నం.1 రియల్ ఎస్టేట్ కంపెనీ అంటూ అందమైన బ్రోచర్లు. దానికి తోడు ఫామ్ ల్యాండ్స్ కొనాలంటూ హీరో రాంచరణ్ ఫోటోతో ప్రచారం. పటాన్ చెరుకు దగ్గర, ఎల్లాపూర్ లోనే సువర్ణ లేక్ వ్యూ ప్రాజెక్ట్ అంటూ సోషల్ మీడియాలో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రతి ప్లాట్‌కి ప్రహరీని నిర్మిస్తాం.

40, 30 అడుగుల రోడ్లు వేస్తాం. విద్యుత్తు సదుపాయం కల్పిస్తాం. ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం తామే ఏర్పాటు చేస్తాం. మూడేండ్ల పాటు తామే మెయింటెన్ చేస్తాం. ఐదారు రకాల పండ్ల మొక్కలు నాటుతాం. గజం కేవలం రూ.7,999. ఆగస్టు వరకే ఈ రేట్ ఉంటుంది. ఆ తర్వాత పెంచేస్తాం. అందుకే రాంచరణ్ చెప్పినట్లు ఫామ్ ప్లాట్లు కొనేయ్యాలంటున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ సర్వే నం.124, 126, 128 నుంచి 131, 132/పి, 133/పి, 134/పి లో 2,48,516 చ.గ.ల్లో(51.13 ఎకరాలు) లే అవుట్ చేసినట్లు ఏజెంట్లు చెప్పారు. అందులో రోడ్లకు 58,680 గజాలు వదిలేశామని, ప్లాటింగ్ ఏరియా 1,89,836 గజాలుగా పేర్కొన్నారు. ఇంత పెద్ద లే అవుట్ వేసి హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా అమ్మేసి సొమ్ము చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాంచరణ్ గారడి

బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీం అంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. రూ.80 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదిన్నరలోనే 1.20 కోట్లు ఇస్తాం.. రూ.40 లక్షలు పెట్టండి, రూ.60 లక్షలు పొందండంటూ ప్రచారం చేస్తున్నారు. రూ.40 లక్షలు లేకపోతే రూ.25 లక్షలు పెట్టండి.. దానికి అనుగుణంగానే మీకు లాభాలు వస్తాయి. సెక్యూరిటీ పర్పస్‌గా కంపెనీ మీకు ఫామ్ ప్లాట్స్ ఇస్తుంది. బై బ్యాక్ ఆఫర్ పేరిట సువర్ణ భూమి కంపెనీ విస్తృతంగా మార్కెటింగ్ టీమ్స్‌ని రంగంలోకి దింపింది.

పెద్ద ఎత్తున మూట గట్టుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడను అమలు చేస్తున్నది. నమ్మకం లేదా? ఐతే మీకు 18 నెలల తర్వాత బ్యాంకులో వేసుకునేటట్లుగా అడ్వాన్స్ చెక్కులు ఇస్తామంటున్నారు. ఇందులో హీరో రాంచరణ్‌ని రంగంలోకి దింపారు. ప్రతి బ్రోచర్‌లోనూ ఆయన ఫోటోనే కనిపిస్తున్నది. ఆయనే వీళ్ల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నట్లుగా దర్శనమిస్తున్నాయి. ఈ కంపెనీకి రాంచరణ్‌కి మధ్య ఏం ఒప్పందం ఉందో అర్ధం కావడం లేదు. కానీ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తుండడం గారడిగా కనిపిస్తున్నది.

పీడీసీల జారీ

ఖైరతాబాద్‌కి చెందిన ఒకరు రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. దానికి గాను సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ (SuvarnBhoomi Infra developers Private Limited) కంపెనీ తరపున మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్ మెమోరండం ఆఫ్ మ్యుచువల్ అండర్ స్టాండింగ్ కుదుర్చుకున్నారు. దానికి గాను అడ్వాన్స్ చెక్కు రూ.6 లక్షలు విలువ కలిగింది వచ్చే ఏడాది ఏప్రిల్ 12 తేదీ వేసి ఇచ్చారు.

అగ్రిమెంట్‌లో ఏదేని కారణాల చేత 18 నెలలు+ 2 నెలలు గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత అమౌంట్ ఇవ్వలేకపోతే 24 శాతం అదనంగా ఇచ్చేటట్లు పేర్కొన్నారు. మరి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వస్తాయా? పెట్టిన పెట్టుబడికి అనుకున్న ప్రకారం 50 శాతం అదనంగా లాభాలు ఇస్తారా? ఇవ్వకపోతే ఏం చేయాలో కంపెనీని ముందుగానే అడగాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెంచర్‌లో ప్రభుత్వ భూమి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ సర్వే నం.128 లో ఖాతా నంబర్ 60336 కేకేఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట 1.32 ఎకరాలు పట్టా భూమిగా నమోదైంది. ఐతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ లో ఈ సర్వే నంబరు పీవోబీ జాబితాలో పేర్కొన్నారు. మొత్తం విస్తీర్ణం 28.18 ఎకరాలు లేఖ నం.బి/గవర్నమెంట్ ల్యాండ్/2007, లేఖ నం.బి/628/2013 ప్రకారం ప్రభుత్వ భూమి అని నర్సాపూర్ తహశీల్దార్ తేల్చారు. దీని ఆధారంగానే నిషేదిత జాబితాలో నమోదు చేశారు.

సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఏజెంట్లు కస్టమర్లకు పంపిన లే అవుట్ లో ఈ సర్వే నంబరు కూడా ఉండడం గమనార్హం. దీంతో ప్రభుత్వ భూములను కూడా కలుపుకొని ఫామ్ ప్లాట్లను విక్రయిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడైంది. ధరణి పోర్టల్ లో మాత్రం వీళ్లకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ గతంలో రూపొందించిన నిషేదిత జాబితాను మార్చలేకపోయారు. దాంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో నేటికీ అది ప్రభుత్వ భూమి అని తహశీల్దార్ ధృవీకరణతోనే నిషేదిత జాబితాలో నమోదు చేసినట్లు స్పష్టంగా ఉంది.

బడా కంపెనీ, రెండు రాష్ట్రాల్లోనే నంబర్ 1 కంపెనీకి ఈ ప్రభుత్వ భూములను కలుపుకొని అమ్మేస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఏ భూమి కొనుగోలు చేసినా పూర్వపు రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. కానీ వీళ్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా జనానికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed