‘స్థానిక’ రిజర్వేషన్లపై సస్పెన్స్.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వెయిటింగ్..!

by Disha Web Desk 19 |
‘స్థానిక’ రిజర్వేషన్లపై సస్పెన్స్.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వెయిటింగ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ ఖారురు కావాల్సి ఉంది. బీసీ కమిషన్ రిపోర్టు తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకోనున్నది. తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. కానీ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్ ఖరారు కావాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రాథమిక స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది.

సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లకు ఒకే పాలసీ అమలు కావాలి. రాష్ట్ర బీసీ కమిషన్ ఈ రిజర్వేషన్‌ను ఖరారు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత క్లారిటీ రానున్నది. రిజర్వేషన్ ఫార్ములా ఖరారు కాకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశమే లేకపోవడంతో ఇది అనివార్యంగా మారింది. రిజర్వేషన్‌ను ఖరారు చేయాల్సిందిగా అటు స్టేట్ బీసీ కమిషన్‌కు, ఇటు ప్రభుత్వానికీ ఎలక్షన్ కమిషన్ లేఖలు రాసింది.

దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఖరారు చేసే నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు రూపొందించనున్నది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా మౌలిక సౌకర్యాల విషయంలో తేడాల్లేకుండా ఎలక్షన్ కమిషన్ ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టింది. బ్యాలట్ పేపర్ల ద్వారా నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్రంలో మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు అవసరం.. ఎన్ని బ్యాలట్ పేపర్లు (అంచనాగా) అవసరం.. వాటికి వాడాల్సిన బ్యాలట్ బాక్సులు.. జిల్లా కేంద్రాలకు తరలించాల్సిన రోడ్ మ్యాప్.. బాక్సులపై అంటించాల్సిన స్టిక్కర్లు.. ఇలాంటివాటి ప్రాసెస్ మొదలైంది.

స్వయంగా ముఖ్యమంత్రే స్థానిక సంస్థల ఎన్నికలు జూన్‌లో రావచ్చన్న సంకేతం ఇవ్వడంతో ఏర్పాట్లపై కమిషన్ దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జనవరిలోనే జరగాల్సి ఉన్నది. కానీ గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు జరగనున్న పార్లమెంటు ఎలక్షన్స్‌తో ఆ ప్రక్రియ వాయిదా పడింది. కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీకాలం కంప్లీట్ కావడంతో ప్రస్తుత స్పెషల్ ఆఫీసర్ల పాలన అమలవుతున్నది.

వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. జూన్‌లో నిర్వహించనున్నట్లు సూచనప్రాయంగా సీఎం సంకేతాలు ఇవ్వడంతో గ్రామ పంచాయతీల బీసీ రిజర్వేషన్ ప్రాసెస్‌ను కొలిక్కి తీసుకురావడం ఒక షరతుగా మారింది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. వీటి గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగుస్తున్నది.

గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. జూలై రెండో వారంకల్లా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కంప్లీట్ చేసి సంక్షేమంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నది. గత పంచాయతీ ఎన్నికల్లో (2019 జనవరి) అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. మొత్తం 12,765 పంచాయతీల్లో 7,774 చోట్ల, 446 మంది జెడ్పీటీసీలు, 3,556 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచారు. ఆ తర్వాతి స్థానం కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన వారిదే.



Next Story

Most Viewed