పొరపాటున సొంత పార్టీ అభ్యర్థినే విమర్శించిన కంగనా రనౌత్

by S Gopi |
పొరపాటున సొంత పార్టీ అభ్యర్థినే విమర్శించిన కంగనా రనౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణంగా రాజకీయ నాయకులు ఒకటి మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి అభాసుపాలవుతుంటారు. రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్‌కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడిని విమర్శించబోయి సొంత పార్టీ నేతను విమర్శించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌, శనివారం సుందర్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. చెడిపోయిన యువరాజులు ఉన్న ఓ పార్టీ ఉంది. వారెవరో కాదు చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకునే రాహుల్ గాంధీ, గూండాయిజం చేయడమే కాకుండా చేపలు తినే తేజస్వి సూర్య అన్నారు. అయితే, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను విమర్శించబోయి కర్ణాటకలోని సొంత పార్టీ లోక్‌సభ అభ్యర్థి తేజస్వి సూర్య పేరును ప్రస్తావించారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపలు తింటున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఉద్దేశిస్తూ తేజస్వి యాదవ్‌ను విమర్శించాలని భావించిన కంగనా రనౌత్ బెంగళూర్ సౌత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య పేరు చెప్పారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో కంగనా పొరపాటు పడ్డారు. ఆమె మాట్లాడిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన తేజస్వి యాదవ్ ఎక్స్‌లో ప్రస్తావిస్తూ ఈ మేడమ్ ఎవరు? అంటూ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed