- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోడకు మూత్రం పోస్తే గొప్పొళ్లు ఐపోతరా బ్రో.?

మనకో పాడలవాటుంది.
అటూ ఇటూ చూస్తాం.
ఓ గోడకు సర్రున మూత్రం కొట్టేస్తాం.
ఏమన్నంటే..
అవ్.. ఏంజెయ్యమంటవ్.. ఆప్కోవాల్నా ఏంది.?
అని ఉల్టా ప్రశ్నలేస్తాం.
ఇంకా.. నీ గోడనా ఇదీ.?
అనే దబాయింపు.
మన ఇంట్లో తినాలి.. తాగాలి..
పక్కోడింట్లో మూత్రం కొట్టాలి.
ఇదెక్కడి సంస్కృతి.?
ఇదేం నీతి.?
అన్నీ తెలిసినోడే ఇలాంటి అడ్డమైన పనులు చేస్తున్నాడు.
కడుపుకు ఏం తింటున్నారో ఆలోచిస్తే.. మళ్లొకసారి ఎక్కడపడితే అక్కడ పోయరు.!
ఒక చిట్టి కథ. బాలయ్యకు బర్రెను పెంచాలనే ఆశ. అంగడికి వెళ్లి ఓ మంచి బర్రెను కొన్నాడు. మెత్తటి పగ్గం.. కొమ్ములకు రంగు చమ్కీలు.. గవ్వల ముక్కుదారం కట్టాడు. నున్నగా గీకించి ఆముదం నూనె పూసి మైసమ్మ దగ్గర పూజచేస్తే ఏక్దమ్ మెరుస్తోంది బర్రె. ఇక మీసం మెలేశాడు మనోడు. దారిలో తాటిచెట్లు కనిపిస్తే తాగి మజాలో మునిగాడు. బర్రె మడుగులో పొర్లి బురద పూసుకుంది. అంత ముస్తాబు చేసి ఏం ఫాయిదా.?
శుభ్రతే సువర్ణం
పైన చెప్పిన చిట్టికథకు.. మూత్రానికి లింకేం లేదు. రెండు కథలు వేరే. కానీ నీతి ఒక్కటే. బాలయ్య ఇగురం లెక్కనే ఉంది నేటి మనుషుల వ్యవహారం. పరిశుభ్రంగా ఉండాలి అనుకుంటారు. ఇంటిని శుభ్రంగా కడుక్కొని అందమైన రంగులేసుకుంటారు. లక్షలు ఖర్చుచేసి చుట్టాలకు దావత్ ఇస్తారు. ఫుల్టుగా తాగినంక రంగుల గోడ కనిపించక సుయ్య్‌మని మూత్రం కొట్టేస్తాడు. లక్షలు ఖర్చుపెట్టి దావత్ చేయడం కాదు.. లక్షణమైన శుభ్రతను పాటించాలి అనే సోయి ఉండదు మనవాళ్లకు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. పేద్ద చెప్పొచ్చాడయ్యా మొనగాడు అనే దెప్పిపొడుసుడు ఒకటి.
ఇదెక్కడి కుక్క బుద్ధి.?
ఇలా అంటున్నందుకు చాలామందికి కోపం వస్తుండొచ్చు. మామూలుగా అయితే ఏ మూలనో దొరికితే కాలు లేపి సటుక్కున మూత్రం కొట్టే అలవాటు కుక్కలకు ఉంటుంది. ఒక ఇల్లు అని లేదు.. చెట్టు అని లేదు.. రోడ్డు అని లేదు. ఎక్కడపడితే అక్కడే కానిచ్చేస్తాయి. సందు దొరికితే సైలెన్సర్ లేపుడే వాటికి తెలిసిన పని. మరి కుక్కలను చూసి నేర్చుకుంటున్నారో లేక కుక్కలే మనుషులను చూసి నేర్చుకుంటున్నాయోగానీ.. ఈ విషయంలో ఇరువురిలో ఒకే రీతి కనిపిస్తోంది. సరే కుక్కలంటే వాటికి తెలియదనుకుందాం. మరి మనుషులకేమైంది.? బహిరంగ మూత్ర విసర్జన అనేది అంత గౌరవ సూచకంగా అనిపిస్తుందా ఏంటి.?
మరుగు వీరులా.?
ఇచ్చట మూత్రం పోయరాదు. పోసినచో పది చెప్పు దెబ్బలు.. రూ.1000 జరిమానా. మూత్రం పోసినవాడు గాడిద అనే బోర్డులు అడుగడుగునా ఉంటాయి. అయినా మనవాళ్లకు అక్కడ పోస్తేనే మనసు తృప్తిగా ఉంటదేమో.? చెప్పుదెబ్బలకు సంకేతంగా అక్కడొక తాడుకట్టి దానికి చెప్పులు కూడా తగిలేస్తారు. కానీ మన మరుగువీరులకు ఇవేవీ పట్టవు. ఎక్కడి నుంచో ఆత్రంగా వస్తాడు. అటూ ఇటూ చూస్తాడు. అంతే ఇగ గోడకు స్నానమే. చూసేవారు కూడా ముక్కు మూసుకొని వెళ్లిపోతుంటారు కానీ.. ఏయ్ ఏం పనివయా అని మందలించే ప్రయత్నం చేయరు. పోసేవాడికి సిగ్గుండదు.. చూసేవాడికి పట్టింపుండదు.
పర్యావరణం కలుషితం
బహిరంగ మూత్ర విసర్జన మనిషికున్న అతి చెడ్డ పాడలవాటు. దీనివల్ల ప్రజలకే కాదు.. పర్యావరణ సమస్యలూ ఉన్నాయి. మూత్రంలో ఉండే ద్రవాలు నీటిని కలుషితం చేస్తాయి. జలచరాలకు ఇది అత్యంత ప్రమాదకరం. మూత్రంలో నేలను కూడా కలుషితం చేస్తుంది. మొక్కల పెరుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే లక్షణం దీనికి ఉంది. అదేవిధంగా భూగర్భజలాలు కూడా కలుషితం అవుతాయి. వ్యాపారాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. పర్యాటకంగా నష్టం చేకూరుస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవన నాణ్యత తగ్గడానికి.. సామాజిక రుగ్మతలకు దారితీస్తుంది.
ఆరోగ్యాలు పాడు..
చెప్తే మనవాళ్లకు నచ్చదు కానీ.. బహిరంగ మూత్ర విసర్జన ఒక మహమ్మారిలాంటిది. మూత్ర నాళాల ఇన్పెక్షన్లు.. హెపటైటిస్.. ఇతర నీటిద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి బహిరంగ మూత్ర విసర్జన దోహదకారిగా పనిచేస్తుంది. మూత్రం అమోనియాను విడుదల చేస్తుంది కాబట్టీ.. దానిద్వారా వచ్చే వాయువులు వాతవరణాన్ని కలుషితం చేస్తాయి. మూత్రం ద్వారా వచ్చే దుర్గంధాన్ని లోపలికి పీల్చుకున్నా లేదా చర్మం ద్వారానైనా అమోనియా.. యూరియా.. క్రియేటినిన్ వంటి విషపూరిత రసాయనాలు శరీరంలోకి వెళ్తాయి. ఫలితంగా శ్వాసకోస సమస్యలు.. కంటిలో దురద.. మూత్రపిండాల సమస్యకు దారితీస్తాయి.
క్యాన్సర్ కారకం..
బహిరంగ మూత్ర విసర్జన వల్ల క్యాన్సర్‌ను ప్రేరేపించే బ్యాక్టీరియాలు.. ఇతర హానికారిక సమ్మేళనాలు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంది. హెపటైటిస్ బి, సి వంటి వైరస్ ఉండి క్యాన్సర్‌కు కారణమవుతాయి. మూత్రంలో ఉండే సీసం.. పాదరసం.. ఆర్సినిక్ వంటి భారీ లోహాలు నాడీ సంబంధిత సమస్యలు.. క్యాన్సర్‌కు కారణమవుతాయి. మూత్రంలో పురుగు మందులు.. కలుపుమందుల అవశేషాలు ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ఎశ్చరీచియా కోలై బ్యాక్టీరియా కూడా దీనిలో ఉండి మూత్రపిండాలను డ్యామేజ్ చేస్తుంది. క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా మూత్రంలో ఉండటం వల్ల న్యుమోనియాకు దారితీస్తుంది.
అధ్యయనాలు.. సర్వేలు
బయట మూత్రం పోయడం వల్ల ఎన్నో సమస్యలున్నాయని అధ్యయన సంస్థలు చెప్తున్నాయి. "తక్కువ ఆదాయ దేశాల్లో బహిరంగ మూత్ర విసర్జన" అనే అంశంపై 2020లో ఒక అధ్యయనం చేశారు. విద్యావంతుల్లో కూడా ఈ ధోరణి ఉన్నట్లు పేర్కొన్నారు. పురుషులు ఎక్కడపడితే అక్కడ మూత్రం పోసేందుకు వెనకాడరని 2019లో జర్నల్ ఆఫ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఫర్ డెవలప్మెంట్ అధ్యయనం చెప్తోంది. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ 2018 ప్రకారం ఈ ధోరణి వల్ల వ్యాధులను మోసే కీటకాలు పుడతాయి. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2020 ప్రకారం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
ఇదెక్కడి సంస్కృతి.?
ఇంట్లో తినాలి.. పక్కింట్లో పోయాలి. ఇదెక్కడి సంస్కృతి బాస్.? ఏమన్నంటే కిచెన్ పక్కనే బాత్రూం ఉంది.. బెడ్రూంకి అటాచింగ్ ఉంది.. హాల్లోకి వాసనొస్తుంది అని అంటుంటారు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు బాత్రూం ఇంట్లోనే ఎవరు కట్టుకోమన్నారండి.? మెట్లకింద కట్టుకునేది ఉండె. అదీ కుదరకపోతే వరండాలో ఇంటికి కొంచెం దూరంగా కట్టాల్సుండె. పాతకాలంలో బాత్రూంలు లేకుండెనా.? ఇప్పుడు ప్రతీదానికి వాస్తు వాస్తూ అంటుంటారు కదా.? మరి ఏ వాస్తు ప్రకారం బయట రోడ్లపై.. చౌరస్తాల్లో బహిరంగంగా మూత్రం పోస్తున్నారు.? ఇదేనా మన సంస్కృతి..?
రాజుల కాలంలోనే..
బహిరంగ మూత్ర విసర్జన రాజుల కాలంలోనే నిషేధం ఉండేదట తెలుసా.? గ్రీస్.. రోమ్ వంటి పురాతన నాగరికతల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉండేవి. భూమిలో రంధ్రాలు చేసి వీటిని నిర్మించేవారు. చైనాలో చాంబర్ పాట్స్ పెట్టేవారట. ఇండియాలో దేవాలయాలు.. మార్కెట్లలో టాయిలెట్స్ ఉండేవి. మధ్యయుగ ఐరోపాలో మరుగునీటి వ్యవస్థగా పనిచేసే కందకాలు ఉండేవి. గార్డెరోబ్స్ అనే చిన్న బాక్సుల ద్వారా కందకానికి నాళం ఉండేది. పట్టణాల్లో ఇంటికి వెనకాల గుంతలు తీసుకునేవారు. పురాతన రోమ్‌లో ప్రజా మూత్రశాలలు.. ప్రజా స్నానపు గుంతలు ఉండేవి. ప్రజలు మూత్ర విసర్జన కోసం వీటిని ఉపయోగించేవారట.
1. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం శిక్ష వేస్తారు.
2. అమెరికాలో క్రమరహిత ప్రవర్తన చట్టం కింద జలుశిక్ష.
3. ఇంగ్లండ్ మెట్రోపాలిటన్ పోలీస్ చట్టం 1839 ప్రకారం సెక్షన్ 87 కింద £1,000 జరిమానా.
4. ఆస్ట్రేలియా నేరాల చట్టం 1966 ప్రకారం సెక్షన్ 6 కింద AU$1,200 వరకు జరిమానా, జైలుశిక్ష.
5. కెనడా క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 175 ప్రకారం జైలు శిక్ష.
6. సింగపూర్‌లో సెక్షన్ 35 ప్రకారం SGD 1,000 వరకు జరిమానా.
1. బహిరంగ మూత్ర విసర్జనకు ఢిల్లీ పోలీస్ చట్టం 1978 ప్రకారం ₹500 జరిమానా, జైలుశిక్ష వేస్తారు.
2. జీహెచ్ఎంసీ మున్సిపల్ నియమాల ప్రకారం ₹100- ₹500 జరిమానా, జైలుశిక్ష.
3. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకారం ₹200- ₹1,000 జరిమానా విధిస్తారు.
4. బెంగళూరులో మహానగర పాలికే ప్రకారం ఐపీసీ 294 సెక్షన్ కింద జైలుశిక్ష, ₹100- ₹500 జరిమానా.
5. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 3నెలల జైలుశిక్ష, ₹200- ₹1,000 జరిమానా.
6. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1980 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, ₹200- ₹1,000 జరిమానా.
వెనకబాటే కారణం
1. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం వల్ల బహిరంగ మూత్ర విసర్జనను ఆశ్రయిస్తున్నారు.
2. కొన్న సంస్కృతులలో బహిరంగంగా మూత్రం పోయడం అనేది పెద్ద తప్పు కాదనే నమ్మకం ఉండటం.
3. మూత్రం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే అవగాహన లేకపోవడం, సరైన విద్య అవగాహన కొరవడటం.
4. ఆఫ్రికన్ సంస్కృతుల్లో బయట మూత్రం పోయడం సహజమైన చర్య అనే భావన ఉండటం.
5. తూర్పు ఆఫ్రికాలో అసలు టాయిలెట్ వ్యవస్థ అంటేనే తెలియదు.
అవగాహన పెరగాలి
ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోయడం ఎంత ప్రమాదకరమో అవగాహన పెరగాలి.
1. ప్రభుత్వాలు ఎక్కువ టాయిలెట్స్ నిర్మించాలి.
2. మొబైల్ టాయిలెట్స్‌ను ప్రోత్సహించాలి.
3. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM)ను ఇంకా విస్తృత పరచాలి.
4. Community-led total sanitation (CLTS) వంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ఇది భారతదేశంలోని 610 గ్రామాలను బహిరంగ మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది.
5. UNICEF వంటి సంస్థల కృషిని స్పూర్తిగా తీసుకోవాలి. Community Approaches to Total Sanitation (CATS) వంటి విధానాలను అవలంబించి బహిరంగ మూత్ర విసర్జనను నియంత్రించారు.
స్వచ్చ సర్వేక్షణ్ సర్వే ప్రకారం..
1. ఇండోర్: బహిరంగ మూత్ర విసిర్జన నిషేధం అమలవుతోంది. అందుకే స్వచ్ఛతలో ఎప్పుడూ టాప్ ప్లేస్లో ఉంటుంది.
2. సూరత్: అగ్రశ్రేణి నగరాల్లో ఒకటి. పరిశుభ్రతకు మారుపేరు.
3. నవీ ముంబై: మౌలిక సదుపాయాలు, సమర్ధ వ్యర్థ పదార్థాల నిర్వహణలో అగ్రశ్రేణి.
4. హైదరాబాద్: వ్యర్థాల నిర్వహణలో మేటి. స్వచ్చ నగరాల్లో అగ్రగామి.
5. విశాఖపట్నం: బీచ్.. పార్కులు.. సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ నగరం.
6. భోపాల్: పచ్చదనం గల నగరం. పరిశుభ్రమైన నగరాల్లో ఇదీ ఒకటి.
- బహిరంగ మూత్ర విసర్జనను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా మరుగుదొడ్లు.. పారిశుద్ధ్య సౌకర్యాలు పెంచడంపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది.
- పట్టణాల్లో 8.98% బయట మలమూత్ర విసర్జనను ఆచరిస్తున్నారు. అంటే ఇది జాతీయ సగటు 12.6% కంటే తక్కువ.
- బహిరంగ మూత్ర విసర్జన పూర్తి నిషేధం అమలవుతున్న దేశం సింగపూర్.
- స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 2030 నాటికి బహిరంగ మూత్ర విసర్జనను అంతం చేయాలనే లక్ష్యాన్ని వేగవంతం చేయాలి.
- 100% పారిశుధ్య కవరేజీని సాధించి బహిరంగ మూత్ర విసర్జనను తొలగించే రాష్ట్రాలు.. జిల్లాలకు ODF సర్టిఫికేషన్ పెంచాలి.
- పారిశుధ్యం కోసం కృషి చేసిన బిందేశ్వర్వర్ పాఠక్.. అరుణ్ రాయ్.. మేధా పాట్కర్ సేవలను నేటి తరానికి తెలియజేయాలి.
- నో టాయిలెట్.. నో బ్రైడ్ ప్రచారాన్ని విస్తృత పరచాలి.
సులభ్ సౌచాలయ
సులభ్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్ అయిన సులభ్ సౌచాలయాలను ప్రజలు వినియోగించుకోవాలి. ఈ వ్యవస్థను డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ స్థాపించారు.
మొబైల్ టాయిలెట్స్
అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో ఈ మొబైల్ టాయిలెట్స్ సిస్టంను రూపొందించారు. ముఖ్యంగా మహిళల కోసం వీటిని వాడుకలోకి తీసుకొచ్చారు. వాటినే షీ టాయిలెట్స్ అంటారు. తెలంగాణలో 49 షీ టాయిలెట్స్ 19 మొబైల్ టాయిలెట్స్ వినియోగంలో ఉన్నాయి. తమిళనాడులో 15 షీ టాయిలెట్స్ ఉన్నాయి. కర్ణాటక, హర్యానా, పంజాబ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాతో సహా 21 రాష్ట్రాల్లో 400కు పైగా షీ టాయిలెట్స్ ఉన్నాయి. అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ వంటి దేశాలు వీటిని కంపల్సరీ చేశాయి.
బహిరంగ మూత్ర విసర్జనపై డాక్యుమెంటరీలు
1. "ది టాయిలెట్: ఎ డాక్యుమెంటరీ" (2016)
2. "ఓపెన్ డెఫికేషన్: ఎ క్రైసిస్ ఇన్ ఇండియా" (2018)
3. "శానిటేషన్: ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ" (2019)
సినిమాలు
1. "టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ" (2017)
2. "ది థ్రోన్" (2015)
3. "మూథోన్" (2019)
లఘు చిత్రాలు
1. "ది యూరినేటర్" (2018)
2. "టాయిలెట్ టేల్స్" (2019)
ఈ సినిమాలు.. డాక్యుమెంటరీలు బహిరంగ మూత్ర విసర్జన సమస్య గురించి అవగాహన పెంచడం.. సమాజంలో సానుకూల మార్పును ప్రోత్సహించడం కోసం దోహదం చేశాయి.
స్పృహతో ఆలోచించండి: బద్దుల కృష్ణకుమార్, పర్యావరణవేత్త
బహిరంగ మూత్ర విసర్జన ఒక సామాజిక వ్యతిరేక చర్య. దీనివల్ల నీరు కలుషితం అవుతుంది. నేల కలుషితం అవుతుంది. అసహ్యకరమైన వాసనలతో పరిసరాలు కంపు కొడతాయి. సామాజిక స్పృహతో ఆలోచించి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. పర్యావరణాన్ని కాపాడాలి.
మారండయ్యా: శివ కసరమోని, క్యాబ్ డ్రైవర్
నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్యాబ్ నడుపుతాను. ఎంప్లాయిస్ డ్రాపింగ్.. పికపింగ్ టైంలో కొద్దిసేపు రోడ్ సైడ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. జనాలు ఖాళీజాగ కనిపిస్తే చాలు మూత్రం పోస్తుంటారు. కొన్నిసార్లు కనీసం పది నిమిషాలు కూడా రోడ్ సైడ్ పార్క్ చేయలేని పరిస్థితి. ఈ జనాలు ఎప్పుడు మారతారో.?
అనారోగ్య సమస్యలు: డాక్టర్ పృథ్వి పేరం, గైనకాలజిస్ట్
బహిరంగ మూత్ర విసర్జన ప్రభావం మానవ ఆరోగ్యంపై చాలా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయడం వల్ల అది నీటిలో కలిసిపోయి ఎన్నో వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్.. కలరా.. టైఫాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన అవసరం.
అవగాహన కల్పిస్తున్నాం: రవిందర్, మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం
పరిసరాల పరిశుభ్రతమే మున్సిపాలిటీల ధ్యేయం. దాన్ని పక్కాగా అమలు పరుస్తున్నాం. బహిరంగ మూత్ర విసర్జన, పరిశుభ్రత, అంటు వ్యాధుల మీద ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడాలి. అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. కానీ ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తే ఇంకా బాగుంటుంది.