మూడు చోట్ల బీ-ఫామ్ టెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థులెవరనే ఉత్కంఠ కంటిన్యూ..!

by Disha Web Desk 19 |
మూడు చోట్ల బీ-ఫామ్ టెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థులెవరనే ఉత్కంఠ కంటిన్యూ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నామినేషన్ల గడువు కంప్లీట్ కావడానికి మరొకరోజే గడువున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు లాంఛనంగా ప్రకటన చేయకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. కానీ టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీ తరఫున మూడు నియోజకవర్గాల్లోనూ ముగ్గురు నామినేషన్లు వేశారు. కరీంనగర్ స్థానంలో వెలిచాల రాజేందర్‌రావు సోమవారం నామినేషన్ వేయగా ఖమ్మం స్థానంలో రామసహాయం రఘుమారెడ్డి మంగళవారం దాఖలు చేశారు. హైదరాబాద్ స్థానంలో సైతం పులిపాటి రాజేశ్‌కుమార్ నాలుగు రోజుల క్రితమే నామినేషన్ వేశారు. ఇప్పుడు వారికి బీ-ఫామ్ టెన్షన్ మొదలైంది. ఈ మూడు స్థానాల్లో అధికారిక అభ్యర్థి ఎవరనేది తేలకుండానే వారి జాగ్రత్తలు వారు తీసుకున్నారు.

టికెట్ దక్కకుంటే ఏంటి పరిస్థితి

నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావడంతో పార్టీ అధికారికంగా పేర్లను ప్రకటిస్తే దానికి అనుగుణంగా బీ-ఫామ్‌లను సమర్పించడానికి ఈ ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో 14 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ హైకమాండ్ ఈ మూడు సీట్లకు మాత్రం ప్రకటన చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఈ మూడు స్థానాల్లో పై ముగ్గురూ నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానంలో డీసీసీ ప్రెసిడెంట్ సమీర్ వలీవుల్లాఖాన్ పేరు వినిపిస్తున్నప్పటికీ రాజేశ్‌కుమార్ దాఖలు చేయడం గమనార్హం. ఖమ్మంలోసైతం పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భార్య నందిని, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ రాయల నాగేశ్వరరావు తదితరుల పేర్లు వినిపిస్తున్నా రఘురామ్‌రెడ్డి నామినేషన్ వేశారు.

కరీంనగర్‌లో అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వెలిచాల రాజేందర్‌రావు దాఖలు చేశారు. లాంఛనంగా ఏఐసీసీ ప్రకటన చేసిన వెంటనే బీ-ఫామ్ తీసుకుని నామినేషన్ వేయడానికి ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసినవారిని అభ్యర్థులుగా ప్రకటించకుండా కొత్త పేర్లను ఏఐసీసీ తెరమీదకు తెస్తే వీరిని పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం బుజ్జగిస్తుందా..? వీరు నామినేషన్లను ఉపసంహరించుకుంటారా..? లేక రెబెల్‌ అభ్యర్థులుగా కొనసాగుతారా..? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి.

మిషన్-15 అనే స్లోగన్‌తో 15 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. గెలుస్తామనే ధీమాను సీఎం రేవంత్ సహా మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నా ఖరారు చేయడం మాత్రం ఏఐసీసీకి సవాలుగా మారింది. ఒకవైపు గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నా అభ్యర్థుల్ని ఫైనల్ చేయడంలో ఆచితూచి అడుగేసే ధోరణి చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed