సుప్రీం కోర్టు తీర్పు.. కేంద్రానికి సీపీఐ నారాయణ స్ట్రాంగ్ కౌంటర్

by Sathputhe Rajesh |
సుప్రీం కోర్టు తీర్పు.. కేంద్రానికి సీపీఐ నారాయణ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అధికారాల పరిధిపై విచారణ జరిగింది. తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో గురువారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఉన్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేస్తున్న అనేక ఇబ్బందుల గురించి సుప్రీం కోర్టుకు వెళ్లారని, దీంతో సుప్రీం అనుకూల తీర్పు ఇచ్చిందన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్.. వాళ్ల వంట మనిషిని కూడా కంట్రోల్ చేయడానికి సాధ్యం కాదని, వంట మనిషి కొడితే కూడా అతని మీద కేసు పెట్టాలంటే కేంద్ర హోం మినిస్టర్ పర్మిషన్ ఇస్తే తప్ప కేసు పెట్టలేరన్నారు. పంజరంలో చిలుకగా పెట్టి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుందని ఆరోపించారు.

ఇది చాలా అన్యాయమని, ఫెడరల్ సిస్టం, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి పవర్స్ ఉంటాయని, కానీ లెఫ్ట్ నెంట్ గవర్నర్స్, గవర్నర్స్‌కు ఉంటాయా? అని ప్రశ్నించారు. ఇది ఎట్టిపరిస్థితిలో ఆమోదించాల్సిన వీలులేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు కేవలం ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రమే కాదని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందన్నారు. పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్, తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్‌లు కుడా వారి పరిధి దాటుతున్నారని విమర్శించారు.

వాళ్లకున్న పరిధి దాటి.. ఎన్నికైన ప్రభుత్వాలను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ బిల్స్ పెండింగ్‌లో పెడుతున్నారని, తమిళనాడు గవర్నర్ సిద్దాంతాలను మాట్లాడి ద్రావిడులను, పెరియార్‌ను అవమాన పరుస్తున్నారని, కేరళ గవర్నర్ మరో విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థతో కంట్రోల్ చేయడమనేది ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదమని, దీనిని గుర్తించాలన్నారు. అందుకే ఉన్నత దర్మాసనం ఇచ్చిన తీర్పు కేవలం డిల్లీ గవర్నర్‌ వరకు మాత్రమే కాదని, ఇతర రాష్టాల గవర్నర్‌లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.


Advertisement

Next Story

Most Viewed