మహబూబ్ నగర్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు

by Gantepaka Srikanth |
మహబూబ్ నగర్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జనరల్ హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, పీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్, వివిధ జిల్లాల డీఎం అండ్ హెచ్ వో లు, డీసీ హెచ్ ఎస్ లు, సూపరింటెండెంట్లతో మంత్రి దామోదర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు- సిబ్బంది-ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందక ఇటు హైదరాబాద్.. అటు కర్నూలు.. రైచూరు తదితర ప్రాంతాలకు వైద్య సేవల కోసం వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్‌ను కార్పొరేట్ హాస్పిటల్‌లకు ధీటుగా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. రూ.10 కోట్లతో ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేసి స్కానింగ్ సేవలను ఉగాది నుండి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సేవలను అందుబాటులోకి తెస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. వీలైనంత త్వరలోనే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటల్స్, జిల్లా ఏరియా హాస్పిటల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్స్, ఇతర సర్వీసులకు సంబంధించి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు సెంట్రల్ మెడిసినల్ స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా సబ్ సెంటర్లు, బస్తీ దవఖానాలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు అంశంపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, జనాభా, ఆసుపత్రుల మధ్య ఉన్న దూరం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త సెంటర్లు , పీహెచ్సీలు, ఇతర ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మెడిసిన్ల సప్లై, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు క్రిమినెంట్ కమిటీ వేశామని.. హాస్పిటల్ లో మెడిసిన్ ఉండేలా చూసుకునే బాధ్యత ఈ కమిటీలది అని మంత్రి తెలిపారు. మందులు లేవు అని పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కమిటీలు ఎప్పుడైనా ఆసుపత్రులను తనిఖీ చేస్తాయని వెల్లడించారు. తనిఖీలలో ప్రజలకు వైద్య సేవలు అందించే విషయములో ఏమాత్రం పొరపాట్లు జరిగిన కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు.. సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా ఉండి ఎటువంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరగనుందని.. ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed