కాంగ్రెస్‌కు వరుస వైఫల్యాలు.. 'చే'జారిన సిట్టింగ్​ స్థానం

by Nagaya |
కాంగ్రెస్‌కు వరుస వైఫల్యాలు.. చేజారిన సిట్టింగ్​ స్థానం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ కంచుకోట బద్దలైంది. మునుగోడు మాదే అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ పరిస్థితిని ముందుగానే ఊహించారు. కానీ, మునుగోడు సెగ్మెంట్​కాంగ్రెస్​ సిట్టింగ్​స్థానం. ఇక్కడి నుంచి రాజగోపాల్​రెడ్డి 2018లో హస్తం గుర్తుపైనే గెలిచారు. అంతకు ముందు పాల్వాయి గోవర్ధన్​ రెడ్డి కూడా వరుస విజయాలు సాధించారు. కానీ, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు ఇదే నల్గొండ జిల్లా నుంచి ఇంతకుముందు జరిగిన హుజూర్​నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ​చావు దెబ్బతిన్నది.

హుజూర్​నగర్‌లో తొలి ఓటమి

నల్గొండ జిల్లాలోని హుజూర్​నగర్‌లో తొలి ఉప ఎన్నిక జరిగింది. 2018లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్​రెడ్డి 2019లో నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేయగా.. సీనియర్​ లీడర్లు, ఎంపీలు రేవంత్​రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు హోరాహోరీ ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2018లో ఓడిపోయిన టీఆర్ఎస్​అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు.

సాగర్​లో 'జానా'కు తప్పలేదు

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్​లో ఉప ఎన్నిక వచ్చింది. 2021లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​నేత జానారెడ్డి పోటీ చేశారు. గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో ఓడిపోయినా.. ఉప ఎన్నికల్లో గెలవడం దాదాపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలిచారు. జానారెడ్డి విజయం కోసం రేవంత్​రెడ్డితో సహా కాంగ్రెస్​ నేతలంతా సాగర్​లో మకాం వేసి రెండు నెలల పాటు శ్రమించినా జానాకు ఓటమి తప్పలేదు.

అటు దుబ్బాక, హుజురాబాద్‌‌లో అంతే..

అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నిక, హుజురాబాద్​ఉప ఎన్నిక పార్టీకి పూడ్చుకోలేని నష్టాన్ని చూపించాయి. దుబ్బాకలో 25 వేల ఓట్లతో సరి పెట్టుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి నేతృత్వంలో హుజురాబాద్​ ఉప ఎన్నిక సైతం ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇక్కడ కనీసం 3 వేల ఓట్లు కూడా రాబట్టుకోలేదు. దీంతో రేవంత్​ పై సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చింది.

ముగ్గురు గెలిచినా.. ఇప్పుడు ఒక్కరు లేరు

2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​ మూడు చోట్ల గెలిచింది. హుజూర్​నగర్​ బైపోల్​లో ఓడిపోగా, నకిరేకల్​ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్​లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో జిల్లాలో మిగిలిన మునుగోడు స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఒకప్పుడు కాంగ్రెస్​ కు బలంగా భావించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ కుదేలైంది.

Advertisement

Next Story

Most Viewed