సంక్షోభంలో స్టడీ టూర్లా..! కార్పొరేటర్లకు బల్దియా ఆర్థిక బాధలు పట్టవా?

by Shiva |
సంక్షోభంలో స్టడీ టూర్లా..! కార్పొరేటర్లకు బల్దియా ఆర్థిక బాధలు పట్టవా?
X

దిశ, సిటీ బ్యూరో : జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం కార్పొరేటర్లకు పట్టదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆర్థికంగా కుదేలు కావటంతో పాటు రొటీన్ మెయింటనెన్స్ గగనంగా మారిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, అమీర్‌పేట బల్దియా మార్కెట్ల ఆధునీకరణ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టి, ఏజెన్సీలు ఖరారైన తర్వాత వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా బ్రేక్ వేశారంటే జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం తీవ్రతను అంచనా వేయవచ్చు. జీహెచ్ఎంసీకి ఆదాయ వనరులను సమకూర్చటంతో పాటు ఆ ఆదాయంతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి, పౌర సేవల నిర్వహణను చేపట్టాల్సిన కార్పొరేటర్లు ఖజానాలో చిల్లి గవ్వలేనప్పుడు స్టడీ టూర్లకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ప్రయత్నాలు, గొంతెమ్మ కోర్కెలు కార్పొరేషన్ మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలేనన్న విమర్శలు సైతం లేకపోలేవు. పైగా పైసాపైసా కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేశామని ఇటీవలే వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటి దుబారా ఖర్చులను ప్రోత్సహిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

అనధికారికంగా స్టడీ టూర్లపై చర్చ..!

ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అనధికారికంగా స్టడీ టూర్ల విషయంపై పలువురు కార్పొరేటర్ల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలాఖరుతో తమ పదవీకాలం ముగియనుండటంతో మళ్లీ ఎన్నికలెప్పుడు జరుగుతాయో, జరిగినా గెలిచేదెవరో, అవకాశమున్నప్పుడే దేశంలోని రెండు ఇతర మహానగరాలకు స్టడీ టూర్‌కు వెళ్దామన్న విషయంపై కార్పొరేటర్లు చర్చించుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న కొందరు కార్పొరేటర్లయితే ఏకంగా విదేశాలకు స్టడీ టూర్‌కు వెళ్దామంటూ మేయర్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని మేయర్ సర్దిచెప్పినా, కొందరు కార్పొరేటర్లు స్టడీ టూర్లకు ఆదేశాలివ్వాలని మేయర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. సకాలంలో సిబ్బందికి జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు స్టడీ టూర్లను తెరపైకి తేవడం సబబు కాదని అదే స్టాండింగ్ కమిటీకి హాజరైన మరి కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మొత్తానికి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్న కొందరు కార్పొరేటర్లు స్టడీ టూర్లకు వెళ్లాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందేనని భీష్మించుకోవటంతో ఈ విషయంపై తర్వాత చర్చించుకుందామంటూ మేయర్ దాట వేసినట్లు సమాచారం.

ఖర్చు కోట్లలోనే..

మొత్తం 150 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు చెందిన మొత్తం 146 మంది కార్పొరేటర్లున్నారు. మిగిలిన నాలుగు డివిజన్లలో ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు మృతిచెందగా, మెహిదీపట్నం, బహదూర్‌పురా డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్న మాజీద్ హుస్సేన్ నాంపల్లి నియోజకవర్గం నుంచి మహ్మద్ మొబిన్ బహదూర్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎమ్మెల్యేలుగా గెలవటంతో ఆ రెండు డివిజన్లకు కార్పొరేటర్లు లేక ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 146 మంది కార్పొరేటర్లు దేశంలోని రెండు మహానగరాలకు వారం రోజుల పాటు స్టడీ టూర్‌కు వెళితే ఖర్చు కోట్లలోనే అవుతుందంటూ అధికారులు అంచనాలేస్తున్నారు.

ఫ్లైటు ప్రయాణం, స్టార్ హోటళ్లలో విడిది, ట్రాన్స్ పోర్టు, రీక్రియేషన్‌తో పాటు ఇతరాత్ర ఖర్చులు కలిపి మొత్తం ఒక్కో కార్పొరేటర్‌కు కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తున్నట్లు సమాచారం. టూర్‌కు మొత్తం రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు సమాచారం. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్లు, పెన్షన్లు కూడా చెల్లించలేని దుస్థితిలో రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల నిధులు జీహెచ్ఎంసీకి ఒక రకంగా పెద్ద ఖర్చే. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు తీవ్రస్థాయిలో నిరసనలు చేపడుతున్న సమయంలో స్టడీ టూర్లకు వెళ్తే, అందుకు నిరసనగా కాంట్రాక్టర్లు వర్షాకాలం సహాయక చర్యలను నిలిపేస్తే ఇబ్బందుల పాలయ్యే ప్రజలకు కార్పొరేటర్లు ఏం సమాధానం చెబుతారన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

స్టడీ టూర్లతో ఒరిగేదేమిటీ?

హైదరాబాద్ నగర పాలక సంస్థ గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు నుంచే కార్పొరేటర్ల స్టడీ టూర్ల పరంపర ఉన్నా, వీటి వల్ల కార్పొరేషన్‌కు ఒరిగేదేమిటీ అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2002 నుంచి 2007 వరకున్న పాలక మండలి అప్పట్‌లో వంద సంఖ్యకే పరిమితమైన కార్పొరేటర్లు సింగపూర్, మలేషియా వంటి దేశాలకు స్టడీ టూర్లంటూ వెళ్లి, పక్షం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలక మండలి కూడా నాగ్‌పూర్, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మహానగరాలకు స్టడీ టూర్లకు వెళ్లి వచ్చారు.

కానీ వారు అక్కడ ఏఅంశంపై స్టడీ చేశారు, ఎంత సబ్జెక్టు సమకూర్చుకున్నారు అన్న విషయాన్ని కార్పొరేటర్లు గానీ, వారితో వెళ్లివచ్చిన ఆఫీసర్లు గానీ బయటకు చెప్పలేదు. పైగా ఆ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేసేవారు. అహ్మదాబాద్ నగరానికి వెళ్లిన అప్పటి పాలకమండలి సభ్యులు ఓ ప్రైవేటు సంస్థ శానిటేషన్ పనుల నిర్వహణపై అధ్యయనం నిమిత్తం వెళ్లారు. దేశంలోనే పలు నగరాలు శానిటేషన్ పనులు, ఘన వ్యర్థాల నియంత్రణ(సాలిడ్ వేస్ట్) మేనేజ్‌మెంట్‌లో ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు గుర్తించి, సిటీకి వచ్చారు. అయినా ఆ తర్వాత జీహెచ్ఎంసీ సిటీలోని పలు పనులను అదే సంస్థకు అప్పగించటం విశేషం.



Next Story