ఎన్ని దాడులు చేసినా వీధి సభలు ఆగవు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

by Vinod kumar |
ఎన్ని దాడులు చేసినా వీధి సభలు ఆగవు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్ట్రీట్ కార్నర్ మీటింగుల ద్వారా బీజేపీ కి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు తమ నేతల పై దాడులకు దిగడం పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగులు ఉధృతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

కానీ బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎం కార్యకర్తలు కలిసి పాతబస్తీలో దాడులకు తెగబడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా దాడి చేసిన వారికి రాచ మర్యాదలు చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ వైఖరి ఏంటో అర్థమవుతోందని ధ్వజమెత్తారు.

జనగామ నియోజకవర్గం గండిరామరంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ప్రజలే తిరస్కరించారన్నారు. స్పీకర్ గా ఎన్నికయ్యాక రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం బాన్సువాడలో దాడులకు ఉసిగొల్పడం ఎంత వరకు కరెక్టని కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ వైఫల్యాలు ఎండగడితే ఇంత ఉలికిపాటు ఎందుకుని ఆయన నిలదీశారు.

ఈ దాడులకు ప్రతిఘటన తప్పదని కాసం హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎన్ని దాడులకు పాల్పడినా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఆగవని స్పష్టంచేశారు. శుక్రవారం నాటికి 2400 వీధి సభలు పూర్తయినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి 11 వేల వీధి సభలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story