ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే వివరాలన్నీ ప్రత్యక్షం

by Gantepaka Srikanth |
ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే వివరాలన్నీ ప్రత్యక్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో ‘వన్ స్టేట్ – వన్ కార్డు’ పాలసీతో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకి సంబంధించిన సర్వే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లోని హాకీ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల సమాచారమంతా ఈ కార్డులోనే ఉంటుందన్నారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అర్హతకు సంబంధించిన వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ కూడా ఇందులోనే ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమలవుతున్నదని, వాటిని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలోనూ అలాంటి పాలసీని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు గ్రామాలు/పట్టణాల్లో పైలట్ బేసిస్‌గా దీనికి కసరత్తు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎదుర్కొన్న సాధక బాధకాలు, అనుకూల ప్రతికూల ఫలితాలను సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వివరించారు.

సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు సత్వరం అందుబాటులోకి తీసుకు రావడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం తెలిపారు. కుటుంబ పెద్దగా మహిళ పేరును పెడుతున్నామని, కుటుంబ సభ్యులందరు సమ్మతిస్తే గ్రూపు ఫోటోను కూడా ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఈ సర్వే, పరిశీలన ప్రక్రియకు ఆర్డీవో స్థాయి అధికారిని నియమించామని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడానికి వీలుగా స్పెషల్ ఆఫీసర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పినట్లు తెలిపారు. ఒక్కో సంక్షేమ పథకం ఒక్కో డిపార్టుమెంటు ఆధ్వర్యంలో అమలవుతున్నందున ఈ డిజిటల్ కార్డు వినియోగంలోకి వస్తే అన్ని శాఖల సమాచారం ఒక్క క్లిక్‌తోనే తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. మొత్తం 30 విభాగాలకు సంబంధించిన పథకాలు అందుకునే లబ్ధిదారుల వివరాలు డిజిటల్ రూపంలో ఈ కార్డులో ఉంటాయన్నారు.

గత ప్రభుత్వంలో వైఫల్యం :

రేషన్ కార్డు కోసం ప్రజలు గడచిన పదేళ్లలో చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా స్పందించలేదని, ఇప్పుడు ప్రతీ పేద కుటుంబానికి రేషను కార్డు అందించాలన్న లక్ష్యంతో అడుగులు పడుతున్నాయన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకే ఈ విధానమని, ఆ కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందన్నారు. ఇక నుంచి అన్ని సంక్షేమ పథకాలకూ ఒకే కార్డు ఉంటుందన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఉచితం, ఇందిరమ్మ ఇండ్లు.. ఇలాంటి సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఏ స్కీమ్‌కు ఎవరు అర్హులో ఈ కార్డు ద్వారా తేలిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ప్రామాణికంగా మారిందో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు స్టాండర్డ్ గా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఒక్కో స్కీమ్‌కు అర్హత పొందినవారి వివరాలు ఒక్కో డిపార్టుమెంటు దగ్గర ఉండడంతో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సంక్లిష్టంగా మారిందని, అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే ఈ సిస్టమ్ ఉద్దేశమన్నారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను పొందుపరుస్తామన్నారు. పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థ వస్తున్నదని, అమలు క్రమంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించేందుకే పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఈ సమస్యల ఆధారంగా పరిష్కారాలు కనుగొని రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నట్లు నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

Next Story