శ్రీశైలంలో 20 అడుగులు లేచిన 10 గేట్లు

by Bhoopathi Nagaiah |
శ్రీశైలంలో 20 అడుగులు లేచిన 10 గేట్లు
X

దిశ, అచ్చంపేట : ఎగువ ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వరదలు ఏమాత్రం తగ్గకపోవడం.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల మూలంగా తగ్గేదే లే అన్నట్లుగా వరద ప్రవాహం ఉప్పెనెల కొనసాగుతోంది. దీంతో దాని దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీ, జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలు పోటెత్తి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగులు పైకి ఎత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షలకు క్యూసెక్కుల వరద జలాలు నిరంతరాయంగా చేరుతున్నాయి. గత మూడు రోజుల నుంచి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో 10 గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు.

అప్రమత్తంగా అధికారులు...

ఎగువ నుంచి గంట గంటకు పెరుగుతున్న వరద జలాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. శుక్రవారం ఎగువ నుంచి మరింత ప్రవాహం పెరగడంతో ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల మేర పైకి ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4, 42,977 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం నాటికి 883.50 అడుగులు చేరుకోగా 207.410 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed