సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత.. బాధ్యతల నుంచి స్పెషల్ పోలీస్ తొలగింపు

by Shiva |
సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత.. బాధ్యతల నుంచి స్పెషల్ పోలీస్ తొలగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయానికి ఇంతకాలం ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీసు (ఎస్పీ) భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగానికి బాధ్యతలను అప్పజెప్పింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి సచివాలయానికి ఎస్పీఎఫ్ సెక్యూరిటీ కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాత సచివాలయం భవనాలు ఉన్నప్పుడూ అదే విభాగం భద్రతను కల్పించింది. కొత్త సెక్రెటేరియట్ నిర్మాణం పూర్తయ్యి పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి స్పెషల్ పోలీస్ అధీనంలోకి వెళ్ళిపోయింది.

అప్పటి సాధారణ పరిపాలన శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2023 ఏప్రిల్ 25 నుంచి స్పెషల్ పోలీసు సెక్యూరిటీ కొనసాగుతున్నది. దాదాపు 16 నెలల తర్వాత (2024 ఆగస్టు 5న) అప్పటి డీజీపీ లేఖ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించింది. స్పెషల్ పోలీసు పరిధి నుంచి ఎస్పీఎఫ్ నిర్వహణలోకి మార్చడంపై ఆలోచనలు చేసింది. చివరకు ఎస్పీఎఫ్‌కు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 16న సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 25న వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం సచివాలయానికి భద్రత కల్పించడంతో పాటు ప్రతి రోజూ పెట్రోలింగ్ నిర్వహించడం, యాక్సెస్ కంట్రోల్ బాధ్యతలను పర్యవేక్షించడం, విధ్వంస వ్యతిరేక చర్యలను సమీక్షించడం స్పెషల్ పోలీసుల బాధ్యతలుగా ఉన్నాయి.

ఈ విధులకు సిటీ పోలీస్, ట్రాఫిక్ విభాగం, ఆక్టోపస్ వింగ్ నుంచి అవసరమైన సందర్భాల్లో వెంటనే రంగంలోకి దూకేలా ‘క్విక్ రియాక్షన్ టీమ్’ల విధుల కోసం వీటి నుంచి తగిన సహకారాన్ని తీసుకుంటున్నాయి. దాదాపు 16 నెలల పాటు సచివాలయానికి స్పెషల్ పోలీసులు సెక్యూరిటీ కల్పించినా ఇటీవల పలు బెటాలియన్ల పోలీసులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో ప్రభత్వం సమీక్షించింది. ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇంతకాలం స్పెషల్ పోలీసులు కొనసాగించిన భద్రతను తొలగించి సాయుధ బలగాల (ఆర్మ్ డ్ రిజర్వు) విభాగానికి ప్రభుత్వం అప్పజెప్పింది.

దానికి కొనసాగింపుగా సచివాలయం సెక్యూరిటీ విషయంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు, కీలకమైన కట్టడాల, భవనాల భద్రతకు ప్రత్యేకమైన శిక్షణ పొందిన ఎస్పీఎఫ్ బలగాలకు అనుభవం కూడా ఉన్నదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న చీఫ్ సెక్రెటరీ ఇక నుంచి ఆ విభాగాన్ని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. స్పెషల్ పోలీసుల నుంచి అన్ని బాధ్యతలను తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed