సంతకం రిజిస్టర్‌లో .. సారేమో జాతరలో..?

by S Gopi |
సంతకం రిజిస్టర్‌లో .. సారేమో జాతరలో..?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దారితప్పి ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్య మౌలిక సదుపాయాల కల్పనకు 'మన ఊరు- మనబడి' కార్యక్రమం పేరుతో లక్షల రూపాయలు వెచ్చిస్తుంటే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా వారి ఇష్టానికి వ్యవహరిస్తూ స్కూలులో లేకున్నా ఉన్నట్టుగా సంతకాలు చేసి మరీ ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంతకం చేసి...

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈనెల మూడవ తేదీన పాఠశాలకు హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకం చేసి ఉండగా అదేరోజు వర్కింగ్ అవర్స్ లోనే పాఠశాలకు 12 కిలోమీటర్ల దూరంలో జరిగిన జాతర కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే సమయంలో ఉపాధ్యాయుడు ఇటు పాఠశాలలో అటు ప్రైవేటు కార్యక్రమంలో ఎలా ఉంటాడని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేటు పాఠ్య పుస్తకాలకే ప్రాధాన్యం..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్ రూపొందించిన విధివిధానాలు, నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉండడంతోపాటు ప్రభుత్వం విద్యార్థుల మానసిక సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన, ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలనే వాడాల్సి ఉంటుంది. కాగా, ఈ పాఠశాలలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠ్యపుస్తకాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఇటీవల కాలంలో ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణలో భాగంగా మండల, జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. అయితే వారు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు పాఠ్య పుస్తకాలు నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారులు లోతుగా విచారణ జరిపితే పాఠ్యపుస్తకాల అంశంలో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పెన్సిల్ తో సీఎల్?

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో ఎక్కడైనా ఉద్యోగి క్యాజువల్ లీవ్ తీసుకుంటే అటెండెన్స్ రిజిస్టర్ లో లీవ్ లో ఉన్న రోజును రెడ్ పెన్ తో సీఎల్ అని రాస్తారు. అయితే ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా వైరస్ సంక్షోభం తర్వాత జూన్ నెలలో పాఠశాల రీ ఓపెన్ సమయంలో ఓ ఉపాధ్యాయురాలు సెలవులో ఉండగా రిజిస్టర్ లో రెడ్ పెన్నుతో కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెన్సిల్ తో సెలవుగా నమోదు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ పై అభ్యంతరాలు ఉండడంతో లీవ్ లో ఉన్న ఉద్యోగులకు మొదట పెన్సిల్ తో సీఎల్ గా నమోదు ఆ తర్వాత ఉన్నతాధికారులకు తెలియకుండా విధులలో ఉన్నట్టుగా సంతకాలు చేయించారనే విమర్శలు ఉన్నాయి.

విచారణ జరుపుతాం: డీఈవో

పాఠశాల వర్కింగ్ అవర్స్ లో స్కూల్ రిజిస్టర్ లో సంతకం చేసి ఉపాధ్యాయుడు జాతరకు వెళ్లిన సంఘటనపై డీఈవో జగన్మోహన్ రెడ్డిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story