మూసీ ప్రక్షాళనతో మంచి ఫలితాలు.. రూట్ మ్యాప్ ఇదే..!

by Gantepaka Srikanth |
మూసీ ప్రక్షాళనతో మంచి ఫలితాలు.. రూట్ మ్యాప్ ఇదే..!
X

చంగ్ గ్యే చన్ కాల్వ.. ఇది సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్‌లో ఉంది. 20 ఏళ్ల క్రితం ఈ కాలువను పునరుద్ధరించారు. దానిని నిర్మించిన తీరు.. అక్కడి ప్రజల పునరావాసానికి తీసుకున్న చర్యలు.. అక్కడి ప్రజల మద్దతు.. తదితర అంశాలపై స్టడీ చేసేందుకు రాష్ట్ర బృందం సియోల్‌కు వెళ్తున్నది. సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఈ నెల 21 నుంచి 24 వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నది. ఈ బృందంలో ఇద్దరు మంత్రులు, ఓ ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం వీరు సియోల్ పర్యటనకు వెళ్తున్నారు. మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నదికి పునరుజ్జీవం పోయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నార్సింగి ప్రాంతంలో హైదరాబాద్‌లోకి ప్రవేశించిన మూసీ.. గౌరెల్లి బ్రిడ్జి దగ్గర సిటీని దాటేస్తుంది. ఈ మధ్యలో ఉన్న దాదాపు 55 కిలోమీటర్లు మేర మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును సక్సెస్ చేసేందుకు పార్టీలకతీతంగా మూసీ ప్రాంత ప్రజాప్రతినిధులను దక్షిణ కొరియాకు తీసుకెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. = శిరందాస్ ప్రవీణ్ కుమార్

11 కి.మీ. కాల్వ పునరుద్ధరణ

దక్షిణ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్. ఇది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద నగరం. ఆ సిటీలో కనుమరుగైన చంగ్ గ్యే చన్ అనే 11 కిలోమీటర్ల నీటి కాల్వను పునరుద్ధరించారు. సియోల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చంగ్ గ్యే చన్ అనే కాల్వపై ఒక ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. చంగ్ గ్యే చన్ అనేది నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ రెండుగా విభజిస్తుంది. హైదరాబాద్‌లోనూ మూసీ కూడా సేమ్. నగరం మధ్యలో ఉంది. ఆ కాల్వ జుంగ్ నాంగ్ చియోన్ అనే చిన్న నదిలో కలుస్తుంది. తర్వాత హాన్ నదిలో విలీనం అవుతుంది. సియోల్ నగరం మధ్య భాగంలో చంగ్ గ్యే చన్ అనే కాల్వ ప్రవాహాన్ని అడ్డుకోకుండా పైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ వే చుట్టూ హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చేశాయి. అతి తక్కువ కాలంలోనే చంగ్ గ్యే చన్ అనేది దాదాపు మాయమైంది. అంటే అక్కడ ఒక కాల్వ ఉండేదని కూడా తెలియకుండా మారింది. దీంతో ఆ కాల్వను పునరుద్ధరించాలని 2003 జూలైలో సియోల్ నగర మేయర్ లీ మ్యూంగ్ బాక్ నిర్ణయించారు. కాల్వ చుట్టు పక్కల కమర్షియల్ భవన యజమానుల పునరావాసం, కాల్వ పునర్నిర్మానానికి రూ.2,360 కోట్లు ఖర్చు అయ్యాయి. దీన్ని 2003లో ప్రారంభించారు. మొదటిగా ఆ కాల్వపై నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వేను తొలగించగా.. దీని ప్రభావం సియోల్ నగర ట్రాఫిక్‌పై పడింది. అప్పుడే ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత కాల్వ చుట్టూ ఉన్న అక్రమ భవనాలను కూలగొట్టారు. అక్కడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజ్ అందించారు. ఈ కాల్వ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం కేటాయించిన బడ్జెట్‌లో అత్యధిక మొత్తం పునరావాసానికే వాడారు.

మొదట వ్యతిరేకించినా..

అక్కడ కూడా కొందరు ఈ కాల్వ పునరుద్ధరణ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అభిప్రాయాలను మార్చుకున్నారు. చంగ్ గ్యే చన్ 11 కి.మీ. మేర కాల్వను పూర్తిగా పునర్నిర్మించారు. అందులోకి హాన్ రివర్, సబ్‌వే లోని గ్రౌండ్ వాటర్‌ను పంప్ చేశారు. నిత్యం ఆ నీటిని పంప్ చేయడంతో కాల్వలో పరిశుభ్రమైన నీళ్లు ప్రవహించడం ప్రారంభమైంది. కాల్వ పూడిపోకుండా పటిష్టమైన కాంక్రీట్ బెడ్స్, కట్టలు నిర్మించారు. నిత్యం సబ్‌బే‌లో ఊరే అండర్ గ్రౌండ్ వాటర్ ప్రవహించేలా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను కేవలం రెండేండ్లలోనే పూర్తి చేశారు. ఇప్పుడు నదిలో అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. అంతే కాకుండా ఈ కాల్వ పారే చుట్టు పక్కల 3.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గిపోయిందట. గతంలో మురికివాడను తలపించిన ప్రాంతం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిపోయింది.

ఇక్కడా సాధ్యమే..

మూసీ విషయంలో కేవలం ఆక్రమణలు తొలగించి.. మురుగు నీరు కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నదిలో నిత్యం నీళ్లు ప్రవహించేలా.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి గోదావరి, కృష్ణ నీటిని పంపింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అసలైన పరీక్ష పునరావాసమే. ప్రభుత్వం ఇండ్లు కోల్పోయిన వాళ్లకు సరైన న్యాయం చేయాలి. పునరావాసం మీద ముందు దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి. ఇక అప్పట్లో కేసీఆర్, కేటీఆర్.. మూసీ నదిమీద ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామన్నారు. ఆ పని మాత్రం చేయొద్దు. సియోల్ నగరంలో కాల్వపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడం వల్లే అసలైన సమస్య మొదలైంది. అది ఆ కాలువ మనుగడనే ప్రశ్నార్థకం చేసిందని నిపుణులు అంటున్నారు. ఎలాగో మూసీ ఆక్రమణలు తొలగిస్తున్నారు కనుక నదికి ఇరువైపులా నడక, రవాణాకు ప్రత్యేకంగా రహదారులు నిర్మించాలి. పైన కొత్తగా బ్రిడ్జిల జోలికి పోవద్దు. ఇక మూసీలోకి స్వచ్ఛమైన నీటిని పంపింగ్ చేయడం ద్వారా.. చుట్టుపక్కల వ్యవసాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కువ ప్రయోజనం, సూర్యాపేటకు తాగునీరు లభ్యం అవుతుంది. చంగ్ గ్యే చన్ కాలువ పునరుద్ధరణ సాధ్యమైనప్పుడు మూసీ నది పునరుజ్జీవం కూడా సాధ్యమేనని సోషల్ మీడియాలోనూ చర్చ జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డునే ఏర్పాటు చేసింది. అక్కడక్కడ కొన్ని పనులు కూడా పూర్తిచేసింది. నాగోలు బ్రడ్జి దగ్గర సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ తర్వాత ఎందుకో మధ్యలోనే వదిలేశారు.

రూట్ క్లియర్..

హైదరాబాద్‌లోనూ మూసీ నగరం మధ్యలో ఉంది. పునరుజ్జీవం పోసుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది. ఉస్మాన్‌సాగర్ చెరువు నుంచి మంచిరేవుల, బైరాగిగూడ, హైదర్షాకోట్, బండ్లగూడ జాగీర్, గండిపేట, నార్సింగి, గంధంగూడల మీదుగా, హిమాయత్‌సాగర్ చెరువు నుంచి హిమాయత్‌సాగర్, దర్గాఖాలీజ్ ఖాన్‌పేట, కిస్మత్‌పూర్, ప్రేమావతిపేట, బుద్వేలు, హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్ మీదుగా సిటీలోకి ప్రవేశిస్తున్నది. అత్తాపూర్ నుంచి గౌరెల్లి వరకు సిటీ డెన్సిటీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా అత్తాపూర్ నుంచి నాగోలు వరకు ఇండ్లు, జనసాంద్రత అత్యధికం. జంట జలాశయాల నుంచి అత్తాపూర్ హై రైజ్డ్ ప్రాజెక్టులు కూడా దర్శనమిస్తున్నాయి.

బడా విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టినవి కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూములు కూడా మూసీకి ఇరువైపులా అందుబాటులో ఉన్నాయి. దాంతో భూ సేకరణ సమస్య ఉత్పన్నం కాదు. అలాగే డిఫెన్స్ ల్యాండ్స్ కూడా వందలాది ఎకరాలు ఉన్నది. గుజరాత్‌లో సబర్మతి పునరుద్ధరణకు డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. అత్తాపూర్, గండిపేట ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న వారిలో కొందరు స్వచ్ఛందంగానే ఖాళీ చేస్తున్నారని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఎలాగూ వారికి సరైన నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న భరోసా కల్పిస్తుండడంతో పెద్ద సమస్యలు ఉత్పన్నం కావని అధికారులు అంటున్నారు.

Advertisement

Next Story