- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు ఆడింది ఆట పాడింది పాట.. జైళ్ల శాఖలో విచిత్రం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: జైళ్ల శాఖలో కొంతమంది ఉన్నతాధికారులు ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. అధికశాతం మంది ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రిజన్స్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించిన అధికారులు ప్రతి జవాన్ నెల జీతం నుంచి 1500 రూపాయలు కోత విధించి సొసైటీకి జమ చేస్తున్నారు. పైస్థాయి అధికారుల జీతం నుంచి 2వేల రూపాయలు మినహాయించి సొసైటీ ఖాతాలో వేస్తున్నారు. సభ్యులకు ఇండ్లు, వాహనాల రుణాలు ఇస్తామని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అయిదేళ్ల సర్వీస్ ఉన్నవారు రుణాలు తీసుకోవటానికి అర్హులు కారని పేర్కొనటం. అయినా వారి జీతాల్లో నుంచి డబ్బులు కట్ చేస్తుండటం.
ఇది మొదటిసారి కాదు..
జైళ్ల శాఖలో ఇలా సొసైటీలు పెట్టటం ఇదే మొదటిసారి కాదని ఆ డిపార్ట్ మెంట్ కు చెందిన కొంతమంది సిబ్బంది చెప్పారు. ఉమ్మడి రాష్ర్టం ఉన్నపుడు 1983లో ప్రిజన్ వెల్ఫేర్ ఫండ్ పేరిట మొదటిసారి ఉద్యోగుల జీతాల్లో నుంచి డబ్బులు మినహాయించారన్నారు. అప్పట్లో జైళ్ల శాఖలో ఉన్నతాధికారులను మినహాయిస్తే దాదాపు మూడువేల మంది గార్డింగ్ సిబ్బంది ఉండేవారని తెలిపారు. ఒక్కొక్కరి జీతం నుంచి అయిదు రూపాయలు మినహాయించి ఫండ్ కు మళ్లించారన్నారు. ఇలా రెండేళ్లపాటు ఉద్యోగుల జీతాల్లో నుంచి డబ్బు మినహాయించిన తరువాత 1985లో ఉన్నట్టుండి దానిని మూసివేసినట్టు వివరించారు. ఈ రెండేళ్లలో ఫండ్ లో ఎంత డబ్బు జమయ్యింది? ఎవరెవరికి ఎంతెంత రుణాలిచ్చారు? రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించారా? అన్న వివరాలను మాత్రం ఉన్నతాధికారులు బయట పెట్టలేదు. నిజానికి ఫండ్ లో జమ అయిన డబ్బును కొంతమంది అధికారులే రుణాల పేర స్వాహా చేశారని ఆ శాఖకు చెందిన సిబ్బందే ఆరోపిస్తున్నారు.
1986లో మరోసారి..
ప్రిజన్ వెల్ఫేర్ ఫండ్ పేర డబ్బులు మాయం చేసిన ఉదంతం చర్చల్లో ఉండగానే మరోసారి జైళ్ల శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ పేర మరోసారి వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈసారి ఒక్కో జవాన్ జీతం నుంచి 20 రూపాయలను కట్ చేసి ఫండ్ కు మళ్లించారు. బైక్, కార్లు, ఎడ్యుకేషన్, కంప్యూటర్, స్వల్పకాలిక రుణాలు ఇస్తామని అప్పట్లో చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పైస్థాయి అధికారులు ఇండ్ల రుణాల పేర రూ.50లక్షలు తీసుకోగా జవాన్లకు రూ.30 లక్షలు మాత్రమే ఇవ్వటం. అదీ ఎంతమందికి ఇచ్చారన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉండటం. ఆ తరువాత సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ కు కూడా మంగళం పాడటం.
తాజాగా మరోసారి..
ఇక, తాజాగా మరోసారి జైళ్ల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కొందరు ప్రిజన్ వెల్ఫేర్ సొసైటీని మొదలుపెట్టారు. రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం జైళ్ల శాఖలో ఏడు వందలమందికి పైగా గార్డింగ్ సిబ్బంది పని చేస్తుండగా ఒక్కొక్కరి జీతం నుంచి 15 వందల రూపాయలు కట్చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల జీతాల్లో నుంచి 2వేలు మినహాయించి ఇందులో జమ చేస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే అధికశాతం మంది గార్డింగ్సిబ్బంది దీనిని వ్యతిరేకించినా అధికారులు బలవంతంగా సొసైటీని మొదలుపెట్టి జీతాల్లో కోత పెడుతుండటం. అదేమంటే మీకు రుణాలు ఇస్తాం కదా అని చెబుతుండటం.
అర్హులు కారు..అయినా..
ఇక విచిత్రమైన విషయమేమిటంటే అయిదేళ్ల సర్వీస్ ఉన్న సిబ్బంది రుణాలు తీసుకోవటానికి అర్హులు కారని ఉన్నతాధికారులు చెబుతుండటం. అయినా వారి జీతాల్లో నుంచి 15 వందల రూపాయలు కట్ చేస్తుండటం. దీనిపై కొందరు సిబ్బంది నిరసన వ్యక్తం చేయగా రిటైర్ అయిన తరువాత మీ డబ్బు మీకిస్తామని చెబుతున్నారు. అయితే, డిపాజిట్ చేయించుకున్న డబ్బుకు వడ్డీ మాత్రం ఇవ్వమంటున్నారు. లోన్లు తీసుకున్న వారి నుంచి వడ్డీ వసూలు చేస్తున్నపుడు మా నుంచి డిపాజిట్ చేయించుకున్న డబ్బుకు ఎందుకు ఇవ్వమని చెబుతున్నారో అర్థం కావటం లేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రతినెలా 15వందల రూపాయల చొప్పున బ్యాంకులో అయిదేళ్లపాటు డబ్బు జమ చేస్తే వడ్డీ ఇస్తారు కదా అని అంటున్నారు. దీన్నిబట్టే మా డబ్బుతో వ్యాపారం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు.