- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి లొసుగులను ఆసరాగా చేసుకొని అక్రమ దందా.. లేని భూమికి హక్కులు!
ధరణి లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. లేని భూములకు హక్కులు పొందుతున్నారు. నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం సేకరించిన భూమినీ.. మళ్లీ ఇతరులకు అమ్మేస్తున్నారు. గుంటల చొప్పున రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ అధికారులు వీరికి సహకారమందిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వంతోపాటు కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్నీ తెలిసినా పాలకులు మాత్రం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బేస్ రికార్డులతో సరిపోల్చకుండా, మొఖా మీద సర్వే చేయకుండా, 30 ఏళ్ల కిందటి భూసేకరణ వివరాలు శాస్త్రీయంగా పరిశీలించకుండా ధరణి పోర్టల్ లో వివరాలను ఆన్ లైన్ చేయడంతో అక్రమాలకు ఆస్కారం లభిస్తున్నది. దీనికి ఎస్సారెస్పీ భూముల సేకరణ, జారీ చేస్తున్న పట్టాలు, క్రయ విక్రయాలే నిదర్శనం. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి ధరణి పోర్టల్ లో మళ్లీ రైతుల పేర్లే కనిపిస్తుండడంతో వాటిని మార్కెట్లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. కొన్ని సర్వే నెంబర్లలో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాన్ని యథేచ్ఛగా పెంచేసి అక్రమంగా పట్టాదారు పాసుబుక్కులు జారీ చేస్తున్నారు. అయితే ఈ పాస్ బుక్కుల ద్వారా బ్యాంక్ లోన్లు తీసుకుంటే కట్టేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికైనా డేటాని సరిదిద్దకపోతే భవిష్యత్తులో లేని భూమికి ఇంకెన్ని హక్కు పత్రాలు/పాసు పుస్తకాలు పుట్టుకొస్తాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదొక్కటి చాలు..
వరంగల్ జిల్లా గీసుగొండ రెవెన్యూ గ్రామంలోని స.సం.475 గురించి తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే! ధరణి పోర్టల్ ను ఎంత హడావుడిగా అమలు చేశారో, ఆశాస్త్రీయంగా రికార్డులు ఎలా ఆన్ లైన్ చేశారో అర్థమైపోతుంది. భూసేకరణ చేసినప్పటి ఎస్సారెస్పీ హైదరాబాద్ ఆఫీసు రికార్డు, ప్రస్తుత ధరణిలో ఆన్ లైన్ డేటాని పోల్చి చూస్తే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తలెత్తాయి. బేస్ రికార్డు ప్రకారం స.సం.475లో ఉండవలసిన మొత్తం ఆరెస్సార్ విస్తీర్ణం 18.27 ఎకరాలు. అందులో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద 10.36 ఎకరాలు పట్టా భూమి సేకరించి, అవార్డు ప్రకటించి పరిహారం చెల్లించారు. కానీ ధరణిలో ఎస్సారెస్పీ పేరిట నిషేధిత జాబితాలో ఉన్నది 3.37 ఎకరాలు మాత్రమే. అంటే ప్రభుత్వానికి చెందాల్సిన 5.39 ఎకరాల భూమి ఇంకా కొందరు రైతుల పేరిటే ఉన్నది. పోనీ ఎస్సారెస్పీ భూమిని తొలగిస్తే నికరంగా రికార్డులో పట్టా జారీ చేసే యోగ్యత కలిగిన భూమి 8.31 ఎకరాలు. కానీ నేడు ధరణిలో సుమారు 17 ఎకరాలకు పట్టాలు జారీ చేశారు. ఇంకా 3.185 ఎకరాలు డిజిటల్ సంతకం పెండింగులో ఉన్నది. గతంలో పూర్తి లేదా పాక్షికంగా ప్రభుత్వ భూములు ఉన్న సర్వే నంబర్లని ఆటోలాక్ చేశారు. దీంతో జెన్యూన్ రైతుల భూముల లావాదేవీలు కూడా ఫ్రీజ్ అయ్యాయి. ఈలోపు వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యింది. ఆ తర్వాత సరైన మొఖా పరిశీలన లేకుండా, ఏదో ఒక ఏడాది పహానీ మాత్రమే ఆధారంగా చేసుకొని గంపగుత్తగా సర్వే నంబర్లు అన్-లాక్ చేశారు. ధరణి డేటాలో ఇన్ని అక్రమ విస్తీర్ణాలు ఉన్నా, తప్పుడు పాసుబుక్కులు జారీ అయినా, ఇదే అదనుగా కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అక్కడి వ్యవసాయ భూములను ఆనుకొని ఉన్న ఎస్సారెస్పీ భూమిని గుంటల్లో ప్లాట్లుగా చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధ్యత ఎవరిది?
అసలు ఈ లెక్కన ఆ సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం ఎంత? సవరించాల్సిన ఆరెస్సార్ విస్తీర్ణం ఎంత? తొలగించాల్సిన పట్టాదారులు ఎవరు? అక్రమ పట్టా పాసుపుస్తకాలపై చర్యలు ఎవరు తీసుకుంటారు? వాటిని బ్యాంకుల్లో కుదువ పెట్టి లోన్లు తెచ్చుకుంటే ఆ తర్వాత తలెత్తే పరిణామాలకు బాధ్యులు ఎవరు? ఎస్సారెస్పీ భూముల పరిరక్షణ బాధ్యత ఎవరిది? ఎక్కడా ఆ భూములకు సరిహద్దు రాళ్లు లేకపోవడంతో యథేచ్ఛగా మొరం తవ్వడం, కోట్లాది రూపాయల విలువైన ఖాళీ స్థలాల్లో కబ్జాలు నిరోధించి బోర్డులు పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పాలకులే. మరోవైపు ఆరెస్సార్ విస్తీర్ణం సమస్య ఉండి నేటికీ డిజిటల్ సైన్ పెండింగులో ఉండి పట్టా రాని రైతులను అదే కార్యాలయం సిబ్బంది ఏళ్ల తరబడి తిప్పుతుండటం గమనార్హం. కనీసం సమస్యలు ఉన్నవాటి వరకైనా సర్వే చేసి, ప్రభుత్వ భూముల వరకైనా హద్దురాళ్లు పాతితే సమస్యలు పరిష్కారం కాగలవు.
పుట్టలకొద్దీ పట్టాలు
ఇదొక్కటే కాదు! గొర్రెకుంట గ్రామంలోనూ ఒక సర్వే నంబరులో రికార్డులో అదనంగా ఉన్న ఎకరం భూమికి తప్పుడు పట్టా పొందాడు అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు. ఇప్పుడక్కడ ఎకరం భూమి విలువ కనీసం రూ.2 కోట్ల పైమాటే. అధికార బలంతో కొందరు పోలీసు అధికారులతో వ్యవహారం నడిపించబోయాడు. కానీ ఎదుటి వ్యక్తి పలుకుబడి కలిగిన వాడవడంతో ఇప్పుడా భూవివాదం హైకోర్టుకి చేరింది. అలాగే ఇంకో సర్వే నంబరులో ప్రభుత్వ, పట్టా భూములు రెండూ కలిసే ఉండటంతో స్థానిక పరిశ్రమల యాజమానులని వసూళ్ల కోసం బెదిరించడం, లేదంటే స్థానిక మునిసిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసి భయాందోళనకు గురి చేయడం ఆయనకి అలవాటని బాధితులు చెప్పారు. ఒక ముఖ్య ప్రజాప్రతినిధి అండ చూసుకొని సదరు నాయకుడు గతంలో రికార్డులో మాత్రమే కనిపించి మొఖా మీద లేని మరో 3 ఎకరాల భూమికి పట్టా పొందే ప్రయత్నం చేశాడు. అలాగే సంగెం, పర్వతగిరి మండలాల్లోనూ అవార్డు ప్రకారం పరిహారం పొందిన భూములు సైతం నేడు ధరణిలో దర్జాగా పట్టాలు జారీ అయ్యాయి.
సేకరించిన భూమి మాయం
ధరణిలో వివరాల్లో నమోదైన లోపాలు, భూసమస్యలు ఆక్రమార్కులకు ఆర్జనగా మారుతున్నాయి. ఇవేమీ తెలియని కొందరు సామాన్య ప్రజలు పాత రికార్డు పరిశీలించకుండా, లింక్ డాక్యుమెంట్లు లేకుండా కోట్లు పోసి ఆ భూములు కొని తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ తప్పుడు వివరాలను సరిదిద్దే ఆప్షన్ కూడా లేకపోవడం ఆక్రమార్కులకు ఆయాచిత వరం, రెవెన్యూ సిబ్బంది వసూళ్లకు కలిసొస్తున్నది. ఇంకా ఎస్సారెస్పీ భూములకు సంబంధించిన రికార్డులు వడపోస్తే ఇలాంటి ఎన్నో వేల ఎకరాల అదనపు విస్తీర్ణాలు, తప్పుడు పాసుబుక్కులు వెలుగు చూస్తాయని ఒక రెవెన్యూ ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూములు కూడా అమ్మేస్తుంటే మిగిలిదేమిటో అధికారులకే తెలియాలి.