ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం:ఉత్తమ్

by Prasad Jukanti |
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం:ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు వేంగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2025 డిసెంబర్ నాటికి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్ లోని జలసౌధలో పాలమూరు రంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ల పురోగతి, నిర్మించాల్సిన ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్యా దాస్, ఈఎన్సీ అనిల్ కుమార్, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా సదర్ మాట్ ప్రాజెక్టు ను ఈ నెల చివరి నాటికి, ఖమ్మం జిల్లాలో రాజీవ్ కెనాల్(సీతారామ ప్రాజెక్ట్)ను ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఉత్తమ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో తక్కువ టైమ్ లో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.

ఏ, బి,సి కేటగిరీలుగా విభజింపు..

ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడతామన్న ఉత్తమ్.. నిర్మాణాల పురోగతికై వాటిని ఏ,బీ, సీ కేటగిరీలుగా విభజించామని చెప్పారు. ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలో, ఆ తరువాత బీ, ఆ తరువాత సీ కేటగిరిగా గా విభజించామన్నారు. ఏ కేటగిరీలో 240.66 కోట్లతో 47,882 ఏకరాల ఆయకట్టును సేద్యంలోకి తీసుకొరాబోతున్నామని ప్రకటించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు సుమారు రూ.7,500 కోట్లపై చిలుకు అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. నీటి పారుదలకు కేటాయించిన రూ.28 వేల కోట్ల బడ్జెట్ లో రూ.18 వేల కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని, మరో రూ.2 వేల కోట్లు జీతభత్యాలకు అవుతున్నాయన్నారు. అందుకే అదనపు బడ్జెట్ ను సమీకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షలపై చిలుకు ఎకరాలు సేద్యంలోకి తేవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. నీటి పారుదల శాఖకు అదనంగా మరో రూ.11 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపాలని నిర్ణయించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed