విద్యార్థుల జీవితాలతో శ్రీ నారాయణ కాలేజీ ఆటలు..!

by Bhoopathi Nagaiah |
విద్యార్థుల జీవితాలతో శ్రీ నారాయణ కాలేజీ ఆటలు..!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అటు శ్రీ నారాయణ కాలేజీ యాజమాన్యం, ఇటు ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంగర్ హౌస్ లో మూడేళ్లుగా శ్రీ నారాయణ జూనియర్ కళాశాలకు అనుమతులు లేకపోయినా ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని స్థానికులు చెబుతున్నారు. శ్రీ నారాయణ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవనే విషయం కొన్ని రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో నిర్ధారణ అయింది. అయినా కూడా ఇంటర్ బోర్డు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందిన కాడికి డబ్బులు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానికులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఎలాంటి పర్మిషన్ లేదని తెలిసినా..

లంగర్ హౌస్‌లోని శ్రీ నారాయణ కళాశాల యాజమాన్యం పర్మిషన్ లేకుండా మూడు సంవత్సరాలుగా కాలేజీని నిర్వహిస్తోంది. అందమైన ప్రకటనలు, ఆకర్షించే బ్రోచర్లతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. లంగర్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ కాలేజీకి వస్తున్నారు. తమ కళాశాలకు అనుమతులు ఉన్నాయని శ్రీ నారాయణ కాలేజీ యాజమాన్యం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని ఒక్కో విద్యార్థుల నుంచి రూ.50 వేల నుంచి రూ.60,000 వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసిన కూడా పట్టించుకోవడం లేదు. కాలేజీ యాజమాన్యం వద్ద డబ్బులు తీసుకుని పర్మిషన్ లేకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తనిఖీల్లో నిర్ధారణ అయినా చర్యలేవి..?

శ్రీ నారాయణ కళాశాలకు పర్మిషన్ లేదని స్థానికులు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వడ్డెన దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ అధికారులు చాలా రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత ఈ నారాయణ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కించడం పై పలు సందేహాలు వస్తున్నాయి. కళాశాల యాజమాన్యం వారికి అమ్యామ్యాలు ముట్టజెప్పి అంతా మేనేజ్ చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

అనుమతి లేని కళాశాలలో చదువుతున్న విద్యార్థుల జీవితాలతో ఇటు ఇంటర్ బోర్డు, అధికారులు అటు నారాయణ కళాశాల యాజమాన్యం చెలగాటమాడుతుంది. శ్రీ నారాయణ కళాశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్న యాజమాన్యం మరో కళాశాల పేరుపైన విరుద్ధంగా పరీక్షలు రాయిస్తున్నారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు నిర్లక్ష్యపు నిద్రమత్తును వీడి శ్రీ నారాయణ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story