డీఎస్సీ అభ్యర్థులకు పండగే

by Maddikunta Saikiran |
డీఎస్సీ అభ్యర్థులకు పండగే
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ నియమకాలకు సంబంధించి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం రాత్రి ముగిసింది. దసరా నాటికి ఎంపికైన అభ్యర్థులకు నియామకాలు జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ను సర్టిఫికెట్ల పరిశీలనకు సమాచారం పంపారు. ఈనెల రెండవ తేదీ నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు మొత్తం 1,0 77 పోస్టులకు గాను 2,636 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపిక చేశారు. ఈ నాలుగు రోజులలో నిర్వహించిన పరిశీలనకు 2,440 మంది అభ్యర్థులు హాజరుకాగా 196 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారు. కాగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించలేదు.

జిల్లాల వారీగా వివరాలు :

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 243 పోస్టులకు గాను అధికారులు 576 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపిక చేయగా 552 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరు అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 172 పోస్టులకు 416 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 387 మంది హాజరుకాగా 29 మంది గైర్హాజరు అయ్యారు. నారాయణపేట జిల్లాలో 279 పోస్టులకు గాను 664 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 585 మంది హాజరు అయ్యారు . 79 మంది వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో 231 పోస్టులకు 617 మంది హాజరు కావలసి ఉండగా 575 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రాగా 42 మంది గైర్హాజరు అయ్యారు. వనపర్తి జిల్లాలో 152 పోస్టులకు గాను 363 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావలసి ఉండగా 341 మంది హాజరుకాగా 22 మంది గైర్హాజరు అయ్యారు.

రెండు రోజులలో తుది జాబితా

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు రోజులలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజులలో అర్హుల తుడి జాబితాను రూపొందించనున్నారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే సమాచారం అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల తొమ్మిదవ తేదీన హైదరాబాదులో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. కాగా ఎంపికైన వారిని ప్రత్యేక బస్సులలో హైదరాబాద్ తరలించేందుకు ఆ జిల్లాల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబురంలో అభ్యర్థులు:

డీఎస్సీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి అన్న నమ్మకంగా ఉన్న అభ్యర్థులు దసరా పండుగను మరింత ఆనందంగా జరుపుకోవాలని సన్నద్ధం అవుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఒకటి రెండు రోజులలోనే అర్హుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రక్రియను సజావుగా నిర్వహించాం: రవీందర్, డీఈవో, మహబూబ్ నగర్ జిల్లా

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో భాగంగా గత నాలుగు రోజులపాటు నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సజావుగా నిర్వహించాము. ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. తుది జాబితాను ఒకటి రెండు రోజులలో పూర్తి చేసి ఫలితాలను రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రకటిస్తాము. ఈనెల తొమ్మిదిన హైదరాబాదులో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారు.

Advertisement

Next Story

Most Viewed