మందుబాబులకు షాక్..సిటీలో బీర్ల కొరత వైన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు !

by Disha Web Desk 18 |
మందుబాబులకు షాక్..సిటీలో బీర్ల కొరత వైన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు !
X

దిశ,శేరిలింగంపల్లి:అసలే ఎండాకాలం, అందులోనూ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరుకుంటారా..పొద్దస్తమానం తిరిగి సాయంత్రానికి చల్లని బీర్ తాగి ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు ఆ కిక్ దొరకడం లేదట. నగర వ్యాప్తంగా ఎక్కడ బీర్లు దొరకని పరిస్థితి నెలకొందని మందుబాబులు బేజారు అవుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే ఎండాకాలంలో బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. అందులోనూ ఇప్పుడు ఓ వైపు ఎండలు మండిపోతుంటే..మరోవైపు లోక్ సభ ఎన్నికలు మరింత హీటెక్కిస్తున్నాయి. అటు ఐపీఎల్ కూడా కొనసాగుతుండడంతో మద్యం ప్రియులు బీరు తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ఎక్కడా బీర్ దొరకని పరిస్థితి ఉందని మందుబాబులు బావూరు మంటున్నారు. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడింది.

డిమాండ్ ఉన్న సప్లై లేదు..

సమ్మర్ సీజన్ కావడంతో సాధారణంగా బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. అయితే ఈసారి ఊహించినదానికంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వైన్స్ షాప్‌ల యజమానులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలోనే పెద్ద మొత్తంలో బీర్ల అమ్మకాలు సాగాయని, ఇప్పుడు ఎండలు మండి పోతుండడంతో మరింత డిమాండ్ పెరిగిందని వైన్ షాపు యజమానులు తెలిపారు. గత రెండు నెలల్లో సాగిన అమ్మకాలు ఈ ఒక్క నెలలోనే అమ్ముడు అయ్యేలా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయినా వైన్స్‌లలో సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ వచ్చిన రెండు గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడు అవుతున్నాయని, చాలా చోట్ల మద్యం ప్రియులు చల్లగా లేకపోయినా పర్వాలేదు బీరు ఉంటే చాలు ఇవ్వమని తీసుకు వెళ్తున్నారంటే బీర్లకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది.

హార్డ్ లేదు..లైట్ లేదు..

హార్డ్ బీర్లు, లైట్ బీర్లు, టిన్‌లు ఇలా రకమైన బీర్లు అందుబాటులో లేవని వైన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఏదో ఒకటి ఇవ్వండి కంపెనీ ఏదైనా పర్వాలేదు మొర్రో అని మద్యం ప్రియులు అంటున్నారు. బీర్ల కొరత పై గత నెలలో మందుబాబులు ఆబ్కారీ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాగా, రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అది కేవలం రెండు రోజుల మురిపంగానే మారిందని మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీ అధికారులు వెంటనే స్పందించి బీర్ల సరఫరాలో ఆలస్యాన్ని అరికట్టాలని, వైన్ షాపుల్లో సరిపడా బీర్లు ఉండేలా చూడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed