జగ్గారెడ్డిని ఫాలో అవుతున్న మరో కాంగ్రెస్ ముఖ్య నేత?

by GSrikanth |   ( Updated:2023-05-25 16:28:15.0  )
జగ్గారెడ్డిని ఫాలో అవుతున్న మరో కాంగ్రెస్ ముఖ్య నేత?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క ఇక పై మరో లెక్క అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అందోల్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం అందోల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అందోల్ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో తొలిసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీంతో రాష్ట్ర స్థాయి నేతగా చక్రం తిప్పిన దామోదర రాజనర్సింహకు వరుస ఓటములతో ఇబ్బందిగా మారాయి. ఈ క్రమంలో దామోదరకు వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై అనేలా మారాయనే టాక్ వినిపిస్తోంది.


జగ్గారెడ్డి దారిలో దామోదర:

కేసీఆర్ హవాతో పాటు స్థానికత అనే నినాదంపై బీఆర్ఎస్ పార్టీ నడిపిన క్యాంపెయిన్ దామోదరకు గత ఎన్నికల్లో దెబ్బతీశాయి. సోనియా గాంధీ వరకు పరపతి ఉన్న దామోదర వరుస ఓటములను మూటగట్టుకోవడం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాలని భావిస్తున్న ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుసరించిన వ్యూహహాన్ని అనుసరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తండ్రి గెలుపే లక్ష్యంగా దామోదర రాజనర్సింహ కూతురు త్రిషా దామోదర్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో వరుస పర్యటనలు, శుభ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒకే రోజు వేరు వేరు మండలాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో తిరిగి కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతంతో పోల్చితే త్రిషా ఇటీవల కాలంలో పొలిటికల్ గా స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.


నిజానికి 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపులో ఆయన కూతురు జయారెడ్డి కీ రోల్ పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్ట్ కాగా జయారెడ్డే తండ్రి గెలుపును భుజాన వేసుకుంది. అప్పటికే ఓటమిపాలై రాజకీయ పరంగా కష్టాల్లో ఉన్న జగ్గారెడ్డి తరపున జయారెడ్డే ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ప్రసంగాలు చేసింది. తండ్రి విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ప్రచారం విషయంలో జగ్గారెడ్డి తన కూతురుకు ప్రీ హ్యాండ్ ఇచ్చారనే చర్చ అప్పట్లో జరిగింది. తండ్రి ప్రోత్సాహంతో ఆమె నియోజకవర్గంలో మరింత దూకుడుగా క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారనే చర్చ జరిగింది. తాజాగా అందోల్ లోను దామోదర్ ఇదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ఈసారి తప్పక గెలిచేందుకు ఓ వైపు దామోదర నియోజకవర్గంలో పర్యటిస్తుంటే మరో వైపు ఆయన కూతురు త్రిషా పార్టీ శ్రేణులతో మమేకం కావడం చర్చనీయాశంగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నప్పటికీ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువతను పార్టీలో తిరిగి యాక్టివ్ చేసే పనిని ఆమె తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంటిపోరు అసలు సమస్య:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పిన దామోదరకు ఇంటిపోరు అసలు సమస్యగా మారిందనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో ఆయన సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం దామోదర గెలుపుపై ప్రభావాన్ని చూపిన వాటిలో ఈ పరిణామం ఒకటి అనే చర్చ జరిగింది. ఇటీవల దామోదర సోదరుడు రామచందర్ నరసింహ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలో దామోదర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా నియోజకవర్గంలో గుప్పుమంటోంది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో బీజేపీలో చేరబోయే నేతల జాబితాలో ఆయన పేరు ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఈ సారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దామోదర్ కు డాటర్ సెంటిమెంట్ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత

Advertisement

Next Story