టీ-కాంగ్రెస్‌లో ‘ఫ్యామిలీ’ ఫైట్.. ఏఐసీసీకి సవాల్‌గా మారిన తెలంగాణ MP అభ్యర్థుల ఎంపిక..!

by Satheesh |   ( Updated:2024-03-11 04:15:34.0  )
టీ-కాంగ్రెస్‌లో ‘ఫ్యామిలీ’ ఫైట్.. ఏఐసీసీకి సవాల్‌గా మారిన తెలంగాణ MP అభ్యర్థుల ఎంపిక..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలకై సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణలోని అన్ని పార్టీలూ అలర్టయ్యాయి. అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలయ్యాయి. బీజేపీ తొమ్మిది మందిని, బీఆర్ఎస్ ఐదుగురిని, కాంగ్రెస్ నలుగురు చొప్పున అనౌన్స్ చేశాయి. సెకండ్ లిస్టు కోసం కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక ఇంట్రెస్టింగ్‌గా మారింది. గెలుపు ఖాయమనే నమ్మకంతో ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలో తెలియక పీసీసీ, ఏఐసీసీ నేతలు తలలు పట్టుకున్నారు. ఆ కారణంగానే ఫస్ట్ లిస్టులో నలుగురితోనే సరిపెట్టుకున్నది. టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసీసీపై ఒత్తిడి పెంచడంతో ఫైనల్ నిర్ణయం తీసుకోలేక ఇబ్బందుల్లో పడింది.

కొన్ని సెగ్మెంట్లలో ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, మరికొన్నిచోట్ల సొంత పార్టీ వర్సెస్ వలస లీడర్లు అనే తేడాలు కాంగ్రెస్‌లో పొడసూపుతున్నాయి. ఒకే నియోజకవర్గానికి పలు ఫ్యామిలీల నుంచి పోటీ ఉండడంతో ఎవ్వరినీ కాదనలేక ఫైనల్ నిర్ణయం తీసుకోవడం ఏఐసీసీకి సవాలుగా మారింది. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ తదితర నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా.. ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత విభేదాలు పెరిగే అవకాశమున్నట్లు ఏఐసీసీ అనుమానిస్తున్నది. ఖరారైన అభ్యర్థి గెలుపు కోసం సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థికంటే ముందు సొంత పార్టీ లీడర్లే ఓడిస్తారన్న భయం వెంటాడుతున్నది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది.

హాట్ సీట్‌గా ఖమ్మం:

ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడైన ప్రసాదరెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఒక దఫా సంప్రదింపులూ జరిగాయని పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. ఇక అదే నియోజకవర్గంలో టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాల్లో టికెట్ ఈ రెండు కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీపరంగా రాజకీయంగా పైచేయి సాధిస్తారని, మరో ఫ్యామిలీని ఎదగనీయకుండా చక్రం తిప్పుతారన్న పరస్పర అనుమానాలు ఉన్నాయి. ఇద్దరూ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నా, ఒకే జిల్లాలో ఒక్క పార్టీ నేతలే అయినా ఆధిపత్యం విషయంలో రాజీ పడడంలేదు.

నాగర్‌కర్నూల్‌లోనూ పోటీపోటీ వ్యూహం:

ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీ మల్లు రవికి టికెట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే మరికొందరు నేతల నుంచీ ఇదే తరహాలో డిమాండ్ వస్తుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. నాగర్‌కర్నూల్ స్థానాన్ని మల్లు రవికి బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ అగ్ర నాయత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగూ రాష్ట్ర వ్యవహారాలను చక్కిదిద్దేందుకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నందున టికెట్ ఇవ్వొద్దన్న ఒత్తిడి ఏఐసీసీపై ఉన్నది. ఇలాంటి పేచీ వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన జోడు పదవుల వివాదం లేకుండా ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు రిజైన్ చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ దాన్ని ఆమోదించలేదు.

మింగుడుపడని పెద్దపల్లి సీట్:

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఏఐసీసీకి మింగుడుపడడంలేదు. ఈ స్థానానికి ఏకంగా 30 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనూ కాంగ్రెస్ గెల్చుకున్నది. ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమనే ఉద్దేశంతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొన్నది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడైన వంశీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బెల్లంపల్లిలో గడ్డం వినోద్ (వివేక్ సోదరుడు) ఉన్నందున ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు ఉంటాయన్న అసంతృప్తి లోకల్ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ స్థానంలో టికెట్ కోసం గజ్జెల కాంతం, మాజీ ఎంపీ సుగుణ కుమారి పోటీ పడుతున్నారు. మాదిగ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజికవర్గానికే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. కానీ గడ్డం వంశీ మాల కమ్యూనిటీ కావడంతో హైకమాండ్ ఆలోచిస్తున్నది. అందువల్లనే పస్ట్ లిస్టులో అభ్యర్థిని ప్రకటించలేదు.

కొరకరాని కొయ్యగా భువనగిరి:

భువనగిరి నియోజకవర్గంలో సైతం అభ్యర్థిని ఖరారు చేయడం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తె కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన భార్య కోసం ట్రై చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్‌కు సన్నిహితంగా ఉంటున్నందున చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మూడు వైపులా పైరవీలు పార్టీ సీనియర్ నేతల నుంచే వస్తుండడంతో నిర్ణయం తీసుకోవడం ఏఐసీసీ పెద్దలకు సవాలుగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తరఫున ఎవరికి ఇచ్చినా ఒక రకంగా సర్దుబాటు అయినా చామల కిరణ్ రెడ్డికి ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి సహకారం ఉండదేమోననే అనుమానం తలెత్తుతున్నది. ఈ పార్లమెంటు సెగ్మెంట్‌లో జనగాం మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలూ కాంగ్రెస్ పార్టీవే. దీంతో ఎంపీ టికెట్‌కు డిమాండ్ ఎక్కువైంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 11న ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాల్లో ఎవరిని ఖరారు చేస్తుందన్నది కీలకంగా మారింది. అసంతృప్తిని బుజ్జగించిన తర్వాతనే ప్రకటించాలన్న ఆలోచన తెరమీదకు వచ్చింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్ థాక్రే ఇదే ఫార్ములాను అమలు చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న దీపాదాస్ మున్షీ ఎలాంటి చాకచక్యాన్ని ప్రదర్శించి అసంతృప్తికి బ్రేకులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed