Health : కాళ్లు, చేతులు మాత్రమే చల్లబడి, శరీరం వేడిగా ఉంటోందా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

by Javid Pasha |
Health : కాళ్లు, చేతులు మాత్రమే చల్లబడి, శరీరం వేడిగా ఉంటోందా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : శరీరంలో జరిగే కొన్ని మార్పులను, బయటకు కనిపించే లక్షణాలను బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వాటి పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. లేకపోతే ప్రమాదకర సంకేతాలను కూడా కొన్నిసార్లు లైట్ తీసుకునే చాన్స్ ఉంటుంది. చిన్న ప్రాబ్లమే కదా అని విస్మరిస్తే తర్వాత పెద్ద సమస్యగా మారవచ్చు. అలాంటి వాటిలో శరీరమంతా వేడిగా ఉండి కేవలం కాళ్లు, చేతులు మాత్రమే చల్లబడటం ఒకటి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* రక్త ప్రసరణ తగ్గడం : శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు సరిపడా రక్తం ఉత్పత్తి కాదు. దీంతో అవయవాలకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మెదడు ప్రమాద సంకేతాన్ని గ్రహించి బాడీని అలర్ట్ చేయడంతో బాడీ టెంపరేచర్ పెరుగుతుందని, ఆ సందర్భంలో కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల అవి చల్లబడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలోనూ ఇలా జరగవచ్చు. కాబట్టి తరచుగా కాళ్లు, చేతులు చల్లబడి, శరీరం వేడెక్కడం వంటి లక్షణాలు రిపీట్ అవుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

* వాతావరణ మార్పులు : కాళ్లు, చేతులు చల్లబడే తాత్కాలిక సంకేతాలన్నీ ప్రమాదకరం అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగనీ తరచుగా అలా జరుగుతుంటే నిర్లక్ష్యం కూడా తగదు. కొన్నిసార్లు వాతావరణ మార్పుల వల్ల కూడా కావచ్చు కాళ్లు, చేతులు చల్లబడతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో బయటకు వెళ్లినప్పుడు, బాగా చలి వేస్తున్నప్పుడు కాళ్లు, చేతులు చల్లబడతాయి. ఆ సమయంలో రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులవల్ల ఇలా జరుగుతుంది.

*రక్త నాళాలు కుంచించుకుపోవడం : శరీరంలో కొవ్వు శాతం పెరగడం, రక్త నాళాలు కుంచించుకుపోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. దీంతో కాళ్లు, చేతులు మాత్రమే చల్లబడి శరీరం వేడెక్కుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరిలో కాళ్లు రెడ్ లేదా బ్లూ కలర్‌లోకి మారడం, తిమ్మిరి, జలదరింపు వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. శరీరానికి తగినంతగా రక్తం అందకపోవడంవల్లే ఇలా జరుగుతుంది.

* ఐరన్ లోపం : శరీరంలో ఐరన్ లోపం లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోయినప్పుడు అవయవాలకు ఆక్సిజన్, రక్తం సరిగ్గా అందదు. ఈ సందర్భంలో కాళ్లు, చేతులకు చల్లబడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతోపాటు హైపోథైరాయిడిజం, డయాబెటిస్ పేషెంట్లలో కూడా సమయానికి తినకపోయినా, వాతావరణం పడకపోయినా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, డీహైడ్రేషన్ వంటివి ఏర్పడతాయి. కాళ్లు, చేతులు చల్లబడి శరీరం వేడెక్కుతుంది. అధిక ఒత్తిడికి గురైన వారిలోనూ రక్త నాళాలు కుంచించుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి కాళ్లు చేతులు చల్లబడటం, గొంతు తడారిపోవడం వంటి లక్షణాలు సంభవించే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

*ఏం చేయాలి? : తరచుగా కాళ్లు, చేతులు చల్లబడి, శరీరం వేడెక్కే లక్షణాలను ఎదుర్కొంటున్నవారు రక్త ప్రసరణలో లోపాలు ఉన్నాయని గ్రహించాలి. వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా తగిన పరిష్కారం సూచిస్తారు. అయితే ఎవరికి వారు ఇలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. తరచుగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవడం, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం ముఖ్యం. శరీరంలో రక్త ప్రసరణ ఆటంకాలకు నివారించడంలో ఇవి సహాయపడతాయి. చల్లటి వాతావరణం వల్ల కాళ్లు, చేతులు చల్లబడే అవకాశం ఉంటే వెచ్చటి దుస్తులు ధరించడం మంచిది. దిన చర్యలో భాగంగా ఎరోబిక్స్, వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటి వ్యాయామాలు కూడా మేలు చేస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తాయి. ఇవన్నీ శరీరంలో రక్తనాళాలను ఉత్తేజ పరిచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed