ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Bhoopathi Nagaiah |
ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్రక్రియ‌ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌజింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్పష్టం చేశారు. మొద‌టి విడ‌త‌లో ఇండ్ల స్థలం ఉన్నవారికి, రెండో విడ‌త‌లో ఇంటి స్థలంతో పాటు ఇందిర‌మ్మ ఇల్లును నిర్మించి ఇస్తామ‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవ‌స్థ, స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో శుక్రవారం చీఫ్ సెక్రట‌రీ శాంతికుమారితో క‌లిసి స‌మీక్షించారు. స‌మావేశంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్ విభాగాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామ‌కం, సర్వేయ‌ర్ల నియామ‌కంపై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంతరం మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన ల‌బ్దిదారుల‌కు సంబంధించిన నివాస స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేని వారి జాబితాలను వేర్వేరుగా గ్రామ‌సభ‌ల్లో పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ద‌శ‌ల వారీగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతామన్నారు. ప్రస్తుతం హౌజింగ్ కార్పొరేష‌న్‌లో 274 మంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నార‌ని, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం, ప‌ర్యవేక్షణ‌కు మ‌రో 400 మంది ఇంజినీర్లు అవ‌స‌ర‌మ‌ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇత‌ర ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది సేవ‌ల‌ను ఏ విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు వంటి అంశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎస్ కి మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వీఆర్వోల ఎంపికకు పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మరోసారి ప్రకటించారు. విలేజీ రెవెన్యూ వ్యవ‌స్థకు సంబంధించిన అంశంలో వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప‌రీక్షకు సంబంధించిన విధి విధానాల‌ను త‌క్షణ‌మే రూపొందించి నిర్వహ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది స‌ర్వేయ‌ర్లు ఉన్నార‌ని, అద‌నంగా మ‌రో వెయ్యి మంది స‌ర్వేయ‌ర్లు అవ‌స‌ర‌మున్న నేప‌ధ్యంలో స‌ర్వేయ‌ర్ల ఎంపికకు కావ‌ల‌సిన ప్రణాళికను త‌యారు చేయాల‌ని, ఎంపిక విధానం పార‌ద‌ర్శకంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యద‌ర్శి న‌వీన్ మిట్టల్, హౌజింగ్ సెక్రట‌రీ జ్యోతి బుద్ధ ప్రకాష్‌, హౌజింగ్ కార్పొరేష‌న్ ఎండీ వీపీ గౌత‌మ్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఇలంబ‌ర్తి, సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మ‌క‌రంద్ పాల్గొన్నారు.

Next Story