నేడు ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక.. మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్న సీఎం

by Shiva |
నేడు ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక.. మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్న సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ను రేపటి నుంచి ప్రారంభించనున్నది. మహిళల పేరు ఇండ్లు మంజూరు చేస్తుండగా.. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రు. 5లక్షలను ఇవ్వనున్నారు. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటాయి. గ‌త ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవ‌స్ధ ఉండేది. ఇప్పుడు ఆవ్యవ‌స్ధను ర‌ద్దుచేసి లబ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించారు. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి గ్రామం, ప్రతి వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు.

అవినీతికి ఆస్కారం లేకుండా మొబైల్ యాప్

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా, అవినీతికి, రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటివి ఈ యాప్ లో పొందుపర్చనున్నారు. ఈ యాప్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించనున్నారు.

నియోజకవర్గానికి సుమారు 4 వేల ఇండ్లు

వచ్చే నాలుగేండ్లలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. మొద‌టి విడ‌త‌లో ఈ ఏడాది ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 3500 నుంచి 4వేల ఇండ్ల చొప్పున.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ల‌క్షల ఇండ్లను నిర్మించాలని భావిస్తున్నది. అయితే మొద‌టి విడ‌త‌లో నివాస స్ధలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని, రెండో ద‌శ‌లో ప్రభుత్వమే నివాస స్ధలంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణయించింది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మాచారులకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనుంది.

ప్రతి పేదవాడికి ఇల్లు కట్టి ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనేదే కాంగ్రెస్ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్లనేవి కాంగ్రెస్ పేటెంట్. ఏ పట్టణం, ఏ ఊరికి వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007 నుంచి 2014 వ‌ర‌కు 23 లక్షలకు పైగా ఇండ్లను మంజురు చేయగా, 19 లక్షలకు పైగా ఇండ్లను నిర్మించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఉద్యోగులను ఇతర శాఖలకు పంపించింది. హౌసింగ్ శాఖను పునరుద్ధరించి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకున్నాం.

Next Story

Most Viewed