- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Congress: పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి: కపిల్ సిబల్ డిమాండ్

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ఖండించారు. బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో విచారించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా నిషేధం విధించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం చేపడితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ అందుకు మద్దతిస్తుందని సిబల్ హామీ ఇచ్చారు. ఈ దాడిని 'పిచ్చి, వెర్రితనంగా' అభివర్ణించిన కపిల్ సిబల్, ఇది అంతకుమించి ఉన్మాదం కూడా కావొచ్చన్నారు. పగడ్బందీగా దీన్ని అమలు చేశారని, బైసరన్ లోయ పెహల్‌గామ్ నుంచి కొంచెం ఎత్తులో ఉంది, కారులో ఎవరూ అక్కడికి వెళ్లలేరు, భద్రతా దళాలు ఏవీ అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుందని తెలిసే దాడికి పూనుకున్నారని అన్నారు.
నెదర్లాండ్స్‌లోని 'ది హేగ్' గా ప్రాచుర్యం ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు.. అంతర్జాతీయ సమాజంలో అలజడి సృష్టించే, దాడులకు దిగే తీవ్రమైన నేరాలతో అభియోగాలు ఉన్న వ్యక్తులను విచారిస్తుంది. మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వంపై దాడి, దురాక్రమణ వంటి నేరాలకు అంతర్జాతీయ కోర్టు శిక్షలు విధిస్తుంది. అయితే, ఈ కోర్టును నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందమైన రోమ్ శాసనానికి భారత్ ఆమోదం తెలపలేదు. ది హేగ్‌ను నిర్వహించే 'అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ పార్టీస్'లో భారత్ భాగం కాదు.
పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా అందరినీ భయకంపితులను చేసింది. ప్రత్యేకించి స్థానిక కశ్మీర్ ప్రాంతంలో మరింత ఎక్కువ భయాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే బుధవారం కశ్మీర్ వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఉగ్రదాడి తర్వాత, బాధ్యులైన ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించాయి. దాడి జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. సాధారణంగా సందడిగా ఉండే పెహల్‌గామ్ పర్యాటక ప్రాంతం వీధులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారి ప్రజలను కలచివేసింది.