కేంద్ర నిధులకు సర్కార్ నో.. ఎస్ఎన్ డీపీకి నిధుల గ్రహణం..

by Sathputhe Rajesh |
కేంద్ర నిధులకు సర్కార్ నో.. ఎస్ఎన్ డీపీకి నిధుల గ్రహణం..
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని వర్షాకాలం వరదల ముప్పు నుంచి రక్షించేందుకు సర్కారు ఇటీవలే చేపట్టిన స్ట్రాటెజికల్ నాలా డెవలప్ మెంట్ ప్రొగ్రామ్(ఎస్ ఎన్ డీపీ) ఊపందుకునే సమయానికి నిధులు లేని గ్రహణం పట్టింది. ఏడాదిన్నర క్రితం జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా నగరంలోని ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెల్సిందే. అప్పట్లో సహాయక చర్యలను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు మహానగరంలో కేవలం వర్షాకాలం సీజన్ లోనే గాక, అకాల వర్షాలు కురిసినపుడు కూడా ఏ మాత్రం నీటి మునగకుండా ఉండేందుకు వీలుగా ప్రమాద నివారణ చర్యలు చేపట్టేందుకు ఎస్ ఎన్ డీపీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందుకు తొలి దశగా రూ. 858 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులతో పనులు చేపట్టేందుకు సర్కారు పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చినా, సకాలంలో సద్వినియోగం చేసుకోని జీహెచ్ఎంసీ అధికారులు ఇపుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా మారింది పరిస్థితి. కొద్ది నెలల క్రితమే హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాకు రీటైనింగ్ వాల్ తో పాటు ఎల్బీనగర్ లో గత వర్షాల్లో నీటి మునిగిన ప్రాంతాల్లో వరద నివారణ చర్యలను అమలు చేస్తూ పనులను ప్రారంభించారు. కానీ ఎపుడు ప్రతిపాదనలు పట్టుకుని ఎస్ ఎన్ డీపీ సమీక్షకు వెళ్లే అధికారులు ప్రతిపాదనలు సరే, పనులు చేపట్టేందుకు నిధులెలా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవారు. కానీ మంత్రి మాత్రం ఇప్పటి వరకు వివిధ దఫాల్లో జరిగిన సమీక్షల్లో నిధులకు కొరతమే లేదంటూ హామీ ఇస్తూ వచ్చి, ఇపుడు పనులెలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విపత్తుల నివారణ నిధుల నుంచి ఎస్ ఎన్ డీపీకి నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ఆశ్రయించగా, లక్షకు పై చిలుకు జనాభా ఉండే నగరాలకు వర్తించే అమృత్ -2 స్కీం కింద ప్రతిపాదనలు పంపితే రూ. వంద కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు నిధులిచ్చే అవకాశముందని కేంద్రం తేల్చి చెప్పటంతో 2020 చివర్లోనే ఎస్ ఎన్ డీపీ కార్యక్రమాన్ని రూ. 858 కోట్లతో అంఛన వేయగా, మున్ముందు పెరుగుతున్న ఎస్ఎస్ ఆర్ ప్ర్రకారం ఈ ఆంచన వ్యయం మరింత పెరిగే అవకాశమున్నందున కేంద్రమిచ్చే నిధులు ఏ మాతం సరిపోవని, తీసుకునేందుకు విముఖతను వ్యక్తం చేసిన సర్కారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా ఈ పనులకు నిధులు సమకూర్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరించటం, ప్రైవేటు ఆర్థిక సంస్థలేమీ ముందుకు రాకపోవటంతో ఎస్ ఎన్ డీపీకి ప్రభుత్వమెలా నిధులు సమకూరుస్తుందో వేచి చూడాలి. నిధులను సమీకరించే లోపు మళ్లీ వర్షాకాలం వచ్చి, మరోసారి మునక తప్పదేమోనన్న భయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

రెండు దశాబ్దాలుగా ఇదే తంతు

మహానగరాన్ని 22 ఏళ్ల క్రితం వరదలు ముంచెత్తినపుడు వరదల నివారణకు అప్పటి ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించేందుకు కిర్లోస్కర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే నాలాల్లోని పూడికతీత పనులను పూర్తి చేసుకోవటంతో పాటు వాటర్ ఇన్ ఫ్లోకు తగిన విధంగానే గాక, అంతకన్నా ఎక్కువ ఔట్ ఫ్లో నగరం నుంచి బయటకు వెళ్లేందుకు వీలుగా ఉన్న వరద నీటి కాలువలు, నాలాల్లో నీటి ప్రవాహానికి అడ్డంకుల్లేకుండా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ కమిటీ సిఫార్సులు చేసి 22 ఏళ్లు గడుస్తున్నా, నేటి వరకు సమైక్య పాలకులు గానీ, ప్రత్యేక రాష్ట్రంలోని సొంత పాలకులు గానీ ఒక్కటి కూడా కట్టుదిట్టంగా అమలు చేసిన పాపాన పోలేదు. నాలాల పేరిట, వర్షాకాలం కష్టాల నివారణ పేరిట, వరదల నివారణ పేరిట వేలాది కోట్లను ఖర్చు చేసిన పాలకులు ఇప్పటి వరకు శాశ్వత పరిష్కార మార్గాలను సమకూర్చకపోవటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్న వాదనలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed