ఒక్కో ఉద్యోగిని ఒక్కోలా ట్రీట్ చేయడమేంటి?.. సీఎస్‌పై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం

by Gantepaka Srikanth |
ఒక్కో ఉద్యోగిని ఒక్కోలా ట్రీట్ చేయడమేంటి?.. సీఎస్‌పై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎస్ శాంతికుమారిపై సెక్రెటేరియట్ ఎంప్లాయీస్ గుర్రుగా ఉన్నారు. ఉద్యోగులందరినీ ఒకే తీరుగా ఆమె చూడటం లేదని విమర్శిస్తున్నారు. సన్నిహితులైన ఎంప్లాయీస్‌కు ఓ రూల్, ఇతర ఉద్యోగులకు మరో రూల్ అమలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంప్లాయీస్ బదిలీలు జరిగాయి. ఏండ్ల కొద్దీ ఒకేచోట పనిచేస్తున్న వారిని గుర్తించి బదిలీ చేశారు. కానీ అందులో తనకు సన్నిహితులైన ఎంప్లాయీస్‌ను సీఎస్ మినహాయించారని సెక్రెటేరియట్ ఎంప్లాయీస్ విమర్శిస్తున్నారు.

ఒక్క సెక్షన్ ఆఫీసర్‌పైనే నమ్మకమా?

లాంగ్ స్టాడింగ్‌లో అన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు అందరినీ ట్రాన్స్‌ఫర్ చేశారు. అందులో భాగంగా ఓ శాఖలోని ఓ ఎస్‌వోను సైతం బదిలీ చేశారు. కానీ తను అక్కడే కొనసాగుతానని, అందుకు అనుమతి ఇవ్వాలని సదరు శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీఎస్‌ను కోరగా, అందుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ సెక్షన్‌లోకి కొత్త సెక్షన్ ఆఫీసర్ వస్తే నమ్మకంగా ఉంటారో లేదోననే అనుమానంతో అతన్ని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనితో సెక్రెటేరియట్‌లో పనిచేస్తున్న మిగతా ఎస్‌వోల పనితీరుపై సీఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీకి విశ్వాసం లేకపోతే ఎలా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

రెవెన్యూకు బదిలీ మళ్లీ వెనక్కి..

చాలా కాలంగా సీఎస్ పేషీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ సెక్రెటరీ సాధారణ బదిలీల్లో భాగంగా రెవెన్యూ శాఖకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తనకు ఉన్న అధికారంతో ఆ ఆఫీసర్‌ను తన పేషీకి తిరిగి ట్రాన్స్‌ఫర్ చేయించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని కొందరు ఎంప్లాయీస్ సీఎస్ వద్ద ప్రస్తావించగా, నమ్మకస్తులైన ఆఫీసర్లనే పేషీల్లో కొనసాగిస్తానని సమాధానం చెప్పినట్టు తెలిసింది.

ఏపీ అధికారికి స్పెషల్ ట్రీట్

రాష్ట్ర విభజనలో భాగంగా అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ జూనియర్ స్టెనో‌గ్రాఫర్ స్థానికత మేరకు ఏపీకి కేటాయించారు. అయితే, అంతరాష్ట్ర బదిలీల్లో మళ్లీ ఇక్కడికి వచ్చారు. సీఎస్ శాంతికుమారి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నప్పుడు సదరు స్టెనో‌గ్రాఫర్ ఆమె పెషీలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె సీఎస్ కావడంతో సెక్రెటేరియట్‌కు డిప్యుటేషన్‌‌పై తీసుకొచ్చి, తన పేషీలో నియమించుకున్నారు. త్వరలో శాంతికుమారి రిటైర్ కానున్నారు. ఈ లోపు ఆ స్టెనో‌గ్రాఫర్‌ను సెక్రెటేరియట్‌లో అబ్జాప్షన్ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఉద్యోగ సంఘ ప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అబ్జాషన్ చేయొద్దని సీఎంవో‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Next Story

Most Viewed