ఈ నెల 22 నుంచి సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

by Javid Pasha |   ( Updated:2023-05-17 16:29:12.0  )
ఈ నెల 22 నుంచి సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకే ‘సీఎం కప్’ టోర్నీ నిర్వహిస్తున్నామని శాట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17వరకు అన్ని మండలాల్లో నిర్వహించిన పోటీలు దిగ్విజయం అయ్యాయన్నారు. 5 క్రీడాంశాలలో అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖో ఖో, ఫుట్‌బాల్‌ పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి దాదాపు 2 లక్షల మంది భాగస్వాములు కాగా, అందులోంచి దాదాపు 85,000 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

ఈ నెల 28 నుంచి 31వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల క్రీడాకారులు పాల్గొనే విధంగా, వారి ప్రతిభకు గుర్తింపు లభించేలా ఈ టోర్నీలు ఎంతో ఉపయుక్తకరంగా ఉన్నాయని అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి, అట్టడుగున ఉన్న గ్రామీణ క్రీడా ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న సీఎం కప్‌ 2023 మొదటి అంచె మండల స్థాయి పోటీలు దిగ్విజయంగా ముగిశాయన్నారు. సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story