అత్యంత కీలకం కాబోతున్న సర్పంచ్ ఓట్లు.. బీఆర్ఎస్‌లో మొదలైన గుబులు!

by GSrikanth |   ( Updated:2023-04-17 01:53:18.0  )
అత్యంత కీలకం కాబోతున్న సర్పంచ్ ఓట్లు.. బీఆర్ఎస్‌లో మొదలైన గుబులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఓట్లే కీలకం కానున్నాయి. ఒక్కో సర్పంచ్ గ్రామంలోని మూడునాలుగు వందల ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. ప్రభుత్వం గ్రామాలకు నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సర్పంచ్‌లు ఓటు వేస్తారోనని ఇప్పటినుంచే బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. చేసిన పనులకు నిధులు మంజూరుకాక, రోజురోజుకు సమస్యలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. అసంతృప్తిని నివారించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు సైతం సత్ఫలితాలు ఇవ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఈ అసంతృప్తి ఎటు దారితీస్తుందోనని ఎమ్మెల్యేలో గుబులు స్టార్ట్ అయింది.

రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ట్రాక్టర్ నిర్వహణ, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, పల్లెప్రగతి, హరితహారం, గ్రామజ్యోతి, మనఊరు-మనప్రణాళిక, పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కానీ గతేడాది ఆగస్టు నుంచి గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదని సమాచారం. అయితే సర్పంచ్‌లు గ్రామాల్లో మౌలిక సమస్యలతో పాటు డంపింగ్ యార్డు, డ్రైనేజీ, ప్రకృతి వనాల నిర్మాణం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ల ఈవీఎంలు చెల్లిస్తున్నారు. అప్పులు చేసి చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చిన వాటికి వడ్డీలు పెరుగుతున్నాయి. దీంతో సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం బిల్లుల మంజూరీలో జాప్యంతో అధికారపార్టీకి చెందిన సర్పంచులతో పాటు ప్రతిపక్షాల సర్పంచులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు నిత్యం మౌలిక సమస్యలపై గళమెత్తుతుండటంతో సర్పంచ్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వీరంతా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.

అప్పులు మాకు... అవార్డులు ప్రభుత్వానికి..

గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు కేంద్రం అవార్డులు అందజేస్తుంది. ఉత్తమ పారిశుధ్యం, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలతో వివిధ కేటాగిరిలలో అవార్డులు అందజేస్తుంది. అవార్డులను సర్పంచుల తరుపున రాష్ట్ర ప్రభుత్వం అందుకుంటుంది. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపడితేనే అవార్డులు వస్తున్నాయని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు ప్రభుత్వానికి... అప్పులు మాకా అని అధికారపార్టీతో పాటు ప్రతిపక్ష సర్పంచ్‌లు సైతం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మండల పరిషత్ సమావేశాల్లోనూ నిలదీస్తూ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. అంతేకాదు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక దగ్గర నిరసనను తెలియజేస్తూనే ఉండటం గమనార్హం.

సత్ఫలితాలివ్వని ఆత్మీయ సమ్మేళనాలు

నేతలు కేడర్ మధ్య, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న గ్యాప్‌ను నివారించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుంది. అయితే ఈ సమ్మేనాలల్లోనే సర్పంచ్‌లు ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీస్తున్నారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే నెలల తరబడి మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సమస్యలపై ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందని ఏం చేయాలో చెప్పాలని నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు ఎలా పోవాలని.. ఇలాగే ఉంటే పార్టీలో కొనసాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

నేతల్లో ఆందోళన

గ్రామస్థాయిలో సర్పంచ్‌లే కీలకం. గ్రామంలో ఎక్కువమంది ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తి. కనీసం ప్రతి గ్రామంలో 500లకు పైగా ఓటర్లపై సర్పంచ్ ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం నెలల తరబడి చేసిన అబివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో అధికారపార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ కాలయాపన తిరిగి రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ మెడకు చుట్టుకునే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు 10లక్షలు ప్రోత్సాహం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడటంతోపాటు సర్పంచ్‌లు సైతం ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రచారానికి వెళ్తే అడ్డుకునే పరిస్థితి నెలకొంటుందనే జంకుతున్నారు.

ఇదిలా ఉంటే పెండింగ్ నిధులు మంజూరు చేయాలని విన్నవించుకుందామంటే మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వరు.. కనీసం సీఎం దృష్టికి తీసుకెళ్దామన్న అవకాశం ఇవ్వడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటే చూద్దాం.. చేద్దామని పేర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప నిధుల విడుదలపై చొరవ తీసుకోవడం లేదని ‘దిశ’తో పలువురు సర్పంచ్‌లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని.. ఏ ముఖంతో గ్రామానికి వస్తారో చూస్తామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో ఫండ్స్ ప్రీజింగ్ ఎత్తేయాలని సర్పంచ్‌లు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఇలా ఉమ్మడి పదిజిల్లాల్లోనూ సర్పంచ్‌లు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సర్పంచ్‌ల చేతుల్లోనే కీలక ఓట్లు ఉండటం.. ప్రభుత్వంపై వ్యతిరేక ఉండటంతో వారి ఓట్లు ఎటుపడతాయోనని బీఆర్ఎస్ నేతలకు గుబులుపట్టుకుంది.


ఇవి కూడా చదవండి:

రాష్ట్రంలో మొదలైన ఎన్నికల వేడి.. ఎనిమిది నెలల ముందే ప్రచారం షురూ!

Advertisement

Next Story